ముగిసిన సమరం | Sakshi
Sakshi News home page

ముగిసిన సమరం

Published Thu, Mar 9 2017 3:23 AM

మిర్జాపూర్‌లో ఓటేసిన కేంద్రసహాయ మంత్రి అనుప్రియా పటేల్‌ - Sakshi

యూపీ ఆఖరి విడతలో 60%, మణిపూర్‌లో 86% పోలింగ్‌

లక్నో: నోట్ల రద్దు నేపథ్యంలో ప్రధాని మోదీ పనితీరుకు, ప్రజాదరణకు రిఫరెండంగా మారిన ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఉత్తరప్రదేశ్, మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల చివరి విడత పోలింగ్‌ బుధవారం జరిగింది. మణిపూర్‌లో చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నాయి. యూపీలో ఏడో, ఆఖరి విడతలో 40 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 60 శాతం పోలింగ్‌ నమోదైంది. 51 మంది మహిళలు సహా 585 మంది పోటీపడ్డారు. మణిపూర్‌ రెండో, ఆఖరి విడతలో 22 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా రికార్డు స్థాయిలో 86% పోలింగ్‌ రికార్డయింది.

98 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. రాష్ట్రంలో 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 79.80 శాతం నమోదైంది. పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలకు ఇటీవలే ఎన్నికలు జరగడం తెలిసిందే. తాజా పోలింగ్‌తో మొత్తం ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. అభ్యర్థుల మృతి వల్ల వాయిదా పడిన యూపీలో ఒక స్థానానికి, ఉత్తరాఖండ్‌లో ఒక స్థానానికి గురువారం ఎన్నికలు నిర్వహిస్తారు. ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు కూడా నేడే వెలువడనున్నాయి. ఈ నెల 11న ఎన్నికల ఓట్లను లెక్కించి అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. యూపీలో ఏడు దశల్లో పోలింగ్‌ సగటున 60 నుంచి 61 శాతం నమోదైందని ఎన్నికల అధికారులు వెల్లడించారు.

Advertisement
Advertisement