రిలయన్స్‌కు డీజీహెచ్ షాక్! | DGH fines Reliance Industries $1.786 billion for gas shortfall | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌కు డీజీహెచ్ షాక్!

Aug 8 2013 12:28 AM | Updated on Sep 1 2017 9:42 PM

రిలయన్స్‌కు డీజీహెచ్ షాక్!

రిలయన్స్‌కు డీజీహెచ్ షాక్!

కేజీ-డీ6 క్షేత్రంలో అంచనాల కన్నా తక్కువగా గ్యాస్ ఉత్పత్తి చేసినందుకుగాను రిలయన్స్ ఇండస్ట్రీస్‌పై (ఆర్‌ఐఎల్) అదనంగా మరో 781 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.4,700 కోట్లు) జరిమానా

న్యూఢిల్లీ: కేజీ-డీ6 క్షేత్రంలో అంచనాల కన్నా తక్కువగా గ్యాస్ ఉత్పత్తి చేసినందుకుగాను రిలయన్స్ ఇండస్ట్రీస్‌పై (ఆర్‌ఐఎల్) అదనంగా మరో 781 మిలియన్ డాలర్ల(దాదాపు రూ.4,700 కోట్లు) జరిమానా విధించాలని డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్(డీజీహెచ్) ప్రభుత్వానికి సూచించింది. దీంతో ఇప్పటిదాకా ఆర్‌ఐఎల్‌పై విధించిన జరిమానా మొత్తం 1.786 బిలియన్ డాలర్ల(సుమారు రూ.10,700 కోట్లు)కు చేరినట్లయింది. 2012-13లో కేజీ-డీ6లో రోజుకి 86.73 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల (ఎంసీఎండీ) గ్యాస్ ఉత్పత్తి చేయాల్సి ఉండగా ఆర్‌ఐఎల్ సగటున కేవలం 26.07 ఎంసీఎండీ మాత్రమే ఉత్పత్తి చేసిందని గత నెల 22న చమురు శాఖకు రాసిన లేఖలో డీజీహెచ్ తెలిపింది ఈ నేపథ్యంలో కేజీ క్షేత్రంపై పెట్టిన పెట్టుబడుల్లో 1.786 బిలియన్ డాలర్ల వ్యయాలను ఆర్‌ఐఎల్ రికవరీ చేసుకోవడాన్ని ఆమోదించరాదని పేర్కొంది. 
 
 ఆర్‌ఐఎల్ 80 ఎంసీఎండీ మేర గ్యాస్ ఉత్పత్తి చేయడానికి సరిపడా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినా.. ప్రస్తుతం 14 ఎంసీఎండీ మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. కంపెనీ ముందుగా చెప్పిన స్థాయిలో గ్యాస్ బావులు తవ్వకపోవడం వల్లే ఉత్పత్తి క్షీణించిపోయిందని, దీని మూలంగా చాలామటుకు మౌలిక సదుపాయాలు నిరుపయోగంగా మారాయని డీజీహెచ్ ఆరోపించింది. వ్యయాల రికవరీని అనుమతించకపోవడం వల్ల ఆర్‌ఐఎల్ అదనంగా లాభాల్లో వాటాల కింద 2012-13 ఆర్థిక సంవత్సరానికి 114 మిలియన్ డాలర్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని డీజీహెచ్ పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే కంపెనీ 103 మిలియన్ డాలర్లు బకాయి పడింది. అయితే, వ్యయాల రికవరీని నిరాకరిస్తూ గతంలో ఇచ్చిన నోటీసులు ప్రస్తుతం ఆర్బిట్రేషన్‌లో ఉన్నందున.. తాజా డీజీహెచ్ లేఖపై చమురు శాఖ ఇంకా చర్యలేమీ చేపట్టలేదు. 
 
 డీజీహెచ్ యూటర్న్..
 గ్యాస్ ఉత్పత్తి తగ్గినందుకు ఆర్‌ఐఎల్‌పై జరిమానా విధించాలంటూ చమురుశాఖకు లేఖ రాసిన డీజీహెచ్.. ఆగస్టు 1న రాసిన మరో లేఖలో అందుకు పూర్తి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. గ్యాస్ ధరలపై పరిమితులు విధించడం, బకాయిపడిన గ్యాస్‌ని పాత ధరకే విక్రయించేలా ఆర్‌ఐఎల్‌ను ఆదేశించాలన్న వాదనలను తోసిపుచ్చింది. గ్యాస్ అన్వేషణ, ఉత్పత్తి సంక్లిష్టమైన అంశం కావడం వల్ల.. క్షేత్ర అభివృద్ధి ప్రణాళికలో అంచనా వేసినట్లుగా గ్యాస్ ఉత్పత్తి కాకపోతే.. దానికి కంపెనీలను బాధ్యులను చేయలేమని పేర్కొంది. డీజీహెచ్ పీఎస్‌సీ హెడ్ అనురాగ్ గుప్తా ఈ నెల 1న ఈ మేరకు లేఖ రాశారు. క్షేత్ర స్థాయిలో సంక్లిష్టమైన పరిస్థితుల కారణంగా ఏ రెండు బ్లాకుల్లోనూ అంచనాలకు అనుగుణంగా ఒకే స్థాయిలో ఉత్పత్తి జరగబోదని తెలిపారు. 
 
 వ్యయాల వివాదమిదీ..
 ఆర్‌ఐఎల్, దాని భాగస్వామ్య సంస్థలు కేజీ డీ6 క్షేత్రంలో వివిధ రూపాల్లో మొత్తంమీద 9.2 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేశాయి. ఉత్పత్తిలో వాటాల పంపకం ఒప్పందం (పీఎస్‌సీ) ప్రకారం ఆర్‌ఐఎల్, దాని భాగస్వామ్య సంస్థలు గ్యాస్ అమ్మకాల ద్వారా వచ్చిన లాభాల్లో ప్రభుత్వానికి వాటాలు పంచడానికి ముందే తమ వ్యయాలను రికవర్ చేసుకోవచ్చు. అంచనాల ప్రకారం ఈ ఏడాది గ్యాస్ ఉత్పత్తి 86.92 ఎంసీఎండీ ఉండాలి గానీ.. ఆ స్థాయికి ఉత్పత్తి ఏనాడూ చేరలేదు. పెపైచ్చు, అవసరానికి మించి మౌలిక సదుపాయాలపై అనవసర ఖర్చు చేయడం వల్ల ప్రభుత్వానికి రావాల్సిన లాభాల్లో వాటా తగ్గిపోయింది. దీంతో.. ఖజానా నష్టపోయిన మొత్తాన్ని రాబట్టేందుకు ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement