కుక్కపై రాయేసినా..!? | Dalit children burned alive on the Union Minister VK Singh | Sakshi
Sakshi News home page

కుక్కపై రాయేసినా..!?

Oct 24 2015 12:24 AM | Updated on Aug 21 2018 9:38 PM

కుక్కపై రాయేసినా..!? - Sakshi

కుక్కపై రాయేసినా..!?

హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఇద్దరు దళిత చిన్నారులను అగ్రకుల రాజ్‌పుట్లు సజీవంగా దహనం చేసిన ఉదంతాన్ని కుక్కను రాళ్లతో కొట్టటంతో పోలుస్తూ

ప్రభుత్వానిదే బాధ్యత అంటారు
దళిత పిల్లల సజీవ దహనంపై కేంద్రమంత్రి వి.కె.సింగ్
 
 దళితులంటే మోదీ సర్కారుకు చిన్నచూపు: విపక్షాలు
♦ సింగ్‌ను తప్పించాలి.. ప్రధాని క్షమాపణ చెప్పాలని డిమాండ్లు
♦ ఎఫ్‌ఐఆర్ నమోదుకు ఎస్సీ కమిషన్ ఆదేశం.. కేసు పెట్టిన ఆప్
 
 
 హరియాణాలో ఇద్దరు దళిత బాలల సజీవ దహనంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ ఘటనకు కేంద్రానిది బాధ్యత అనొద్దంటూ.. ‘కుక్కపై రాయేసినా కేంద్రానిదే బాధ్యతంటారు’ అంటూ కేంద్రమంత్రి, మాజీ సైన్యాధిపతి వి.కె.సింగ్ వ్యాఖ్యానించి మరో వివాదానికి తెరతీశారు. దళితులు, ముస్లింలు, పేదలు, అణగారిన వర్గాల వారంటే మోదీ సర్కారుకు గల ఈసడింపునకు ఈ వ్యాఖ్యలు నిదర్శనమని కాంగ్రెస్, లెఫ్ట్, ఇతర విపక్షాలు. ఇదిలావుండగానే హరియాణాలోనే పోలీస్ కస్టడీలో ఒక దళిత బాలుడు చనిపోవటం, గ్రామంలో అగ్రవర్ణాల వారు కిరోసిన్ పోసి నిప్పటించగా కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన మరో దళిత యువకుడు మరణించటం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ వేర్వేరు ఘటనలని.. వీటికి కులం రంగు పులమొద్దని హరియాణా సీఎం ఖట్టర్ మీడియాపై మండిపడ్డారు.
 
 ఘజియాబాద్/న్యూఢిల్లీ: హరియాణాలోని ఫరీదాబాద్‌లో ఇద్దరు దళిత చిన్నారులను అగ్రకుల రాజ్‌పుట్లు సజీవంగా దహనం చేసిన ఉదంతాన్ని కుక్కను రాళ్లతో కొట్టటంతో పోలుస్తూ కేంద్రమంత్రి వి.కె. సింగ్ దారుణ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తన సొంత లోక్‌సభ నియోజకవర్గమైన ఘజియాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘స్థానిక సంఘటనలను ఎన్నడూ కేంద్ర ప్రభుత్వంతో ముడిపెట్టకండి. ఆ ఘటనపై విచారణ జరుగుతోంది. ఆ తర్వాత అది కేంద్రం వద్దకు వస్తుంది. ప్రతి దానికీ.. ఎవరైనా ఒక కుక్కను రాయితో కొడితే దానికి ప్రభుత్వానిదే బాధ్యత అన్నట్టు ఉంది’అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై పెను రాజకీయ దుమారం చెలరేగింది.

ఆయనను విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి పదవి నుంచి తొలగించాలని.. ఎస్సీ, ఎస్టీలపై అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. తీవ్ర విమర్శలు వెల్లువెత్తటంతో సింగ్ ఆ తర్వాత ఒక ప్రకటన చేస్తూ.. దళిత చిన్నారుల హత్య పిరికిపంద చర్య అని.. అది ప్రస్తుత సమాజపు పరిస్థితికి దిగ్భ్రాంతికరంగా అద్దంపడుతోందని  అన్నారు. మానసిక రోగులు చేసిన ప్రతి పనికీ ప్రభుత్వాన్ని నిందించరాదంటూ.. తన వ్యాఖ్యలను వక్రీకరించరాదని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సిందిగా షెడ్యూల్డు కులాల జాతీయ కమిషన్ ఉత్తరప్రదేశ్ డీజీపీ, ఢిల్లీ పోలీస్ కమిషనర్లను ఆదేశించింది.  

 మూర్ఖత్వం.. గర్హనీయం: కాంగ్రెస్
 దళిత చిన్నారుల దహనాన్ని కుక్కను రాయితో కొట్టటంతో పోల్చటం మూర్ఖత్వం, గర్హనీయమని కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ అన్నారు. రెండేళ్ల కిందట ప్రస్తుత ప్రధాని మోదీ గుజరాత్ అల్లర్లపై స్పందిస్తూ.. ఒక కుక్కపిల్ల కారు కింద పడి నుజ్జయిపోతే దానికి కూడా సానుభూతి తెలియజేయాలని అనటాన్ని ప్రస్తావించారు. దళితులు, ముస్లింలు, పేదలు, అణగారిన ప్రజలను చిన్నచూపు చూసే కేంద్ర ప్రభుత్వ ఆలోచనా రీతిని ప్రతిబింబిస్తోందని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా విమర్శించారు.

తన మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేత సెల్జా డిమాండ్ చేశారు. వి.కె.సింగ్‌ను తక్షణం మంత్రి పదవి నుంచి తొలగించాలని ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఆయనను అరెస్ట్ చేయాల్సిందిగా ఆప్ ఎమ్మెల్యేలు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సింగ్‌ను జైలుకు పంపాలని బీఎస్‌పీ చీఫ్ మాయావతి అన్నారు.    

 పెద్దది చేయొద్దు.. బీజేపీ: వి.కె.సింగ్ వివరణ ఇచ్చినందున.. ఈ విషయాన్ని పెద్దది చేయరాదని అధికార బీజేపీ ఆయనకు మద్దతుగా స్పందించింది. సింగ్‌పై కేసు పెట్టాలన్న ఆప్ పై మండిపడింది. ఢిల్లీలో డెంగీ సోకిన ఓ  బాలుడిని ఆస్పత్రిలో చేర్చుకోకపోవడంతో అతడు చనిపోయినప్పుడు, అతని తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆప్ ఏం చేసిందని ప్రశ్నించింది.  దళిత బాలల హత్యకు పాల్పడిన వారిని ఉపేక్షించబోమని హరియాణా సీఎం ఎంఎల్ ఖట్టర్ పేర్కొన్నారు. ఆయన గురువారం సున్‌పేడ్ గ్రామంలో బాధిత కుటుంబాన్ని సందర్శించారు. మృతుల తండ్రికి రూ. 10 లక్షల చెక్కు అందించారు. వేర్వేరుగా జరిగిన సంఘటనలకు కులం రంగు పులుపుముతున్నారని విమర్శించారు.  

 హద్దులు మీరొద్దు: రాజ్‌నాథ్
 వి.కె. సింగ్‌ను, ఉత్తర భారతీయులు నిబంధనల ఉల్లంఘనను గర్వంగా భావిస్తారని అన్న మరో కేంద్ర మంత్రి  కిరణ్ రిజిజును హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తీవ్రంగా మందలించారు. హద్దులు మీరి ప్రవర్తించవద్దని హెచ్చరించారు. ‘మంత్రుల వ్యాఖ్యలు వక్రీకరించారంటూ మేం తప్పించుకోవాలనుకోవడం లేదు. అధికార పార్టీ నేతలు అభిప్రాయాలు వెలిబుచ్చే ముందు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది’ అని విలేకర్లతో అన్నారు.

 మతవిద్వేషాలు అడ్డుకోండి: రాహుల్
 ‘దాద్రీ’ ఘటన, ఫరీదాబాద్‌లో దళిత చిన్నారుల సజీవదహనం వంటి సందర్భాల్లో పరిస్థితులను సమర్ధవంతంగా ఎదుర్కోవాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) నేతలకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ సూచించారు.
 
 దళిత బాలుడి అనుమానాస్పద మృతి
  సోనిపట్: హరియాణాలో ఓ దళిత బాలుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. పావురాన్ని దొంగిలించాడని పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లిన మరుసటి రోజే శవమై కనిపించాడు. తమ కొడుకును చిత్రవధకు గురి చేసి పోలీసులే చంపేశారని బాలుడి కుటుంబం ఆరోపిస్తోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇద్దరు ఏఎస్సైలను  సస్పెండ్ చేసి, వారిపై హత్య కేసు నమోదు చేసింది. బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతోపాటు  పరిహారమిస్తామని, తెలిపింది. సోనిపట్ జిల్లా దేవీపుర గ్రామానికి చెందిన 15 ఏళ్ల దళిత బాలుడు గోవింద్ పావురాన్ని దొంగిలించాడని గడియా లోహర్ కులానికి చెందిన కొందరు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గోవింద్‌ను పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. గోవింద్ కుటుంబీకులు స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. విడిచిపెట్టాలంటే రూ.15 వేలు ఇవ్వాలని పోలీసులు డిమాండ్ చేశారని గోవింద్ సోదరుడు గౌతమ్ ఆరోపించారు. రాత్రి డబ్బు తీసుకొని వెళ్లగా అప్పటికే విడిచిపెట్టామని, ఎక్కడైనా ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు చెప్పాన్నారు. బుధవారం కుటుంబీకులు ఊరిలో వెతగ్గా.. తన ఇంటి దగ్గర్లోని గోవింద్ ఉరేసుకొని కనిపించాడు. ఉరి వల్లే చనిపోయినట్లు, గాయాలేవీ లేవని వైద్యులు చెప్పారు. బాలుడిది ఆత్మహత్యేని సీఎం ఖట్టర్ కూడా అన్నారు. ఆత్మహత్యకు కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
 
 దళిత యువకుడి సజీవ దహనం!
 చండీగఢ్: హరియాణాలోనే మరో ఘటనలో 21 ఏళ్ల ఓ దళిత యువకుడిని గ్రామ మాజీ పెద్ద కుటుంబం కాల్చి చంపింది. పాత కక్షలతోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. యమునానగర్ జిల్లా దౌలత్‌పూర్ గ్రామానికి చెందిన రజత్ కుటుంబానికి అదే ఊరిలోని రాం స్వరూప్ కుటుంబంతో ఈ నెల 5న గొడవ జరిగింది. కేసు నమోదు కావడంతో రజత్ జైలుకు వెళ్లి 20న బయటకు వచ్చాడు.

ఆ కుటుంబాల మధ్య మళ్లీ గొడవ జరిగింది. మంగళవారం రజత్ కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరి, బుధవారం చనిపోయాడు. స్వరూప్ కుటుంబీకులే తన కుమారుడిపై కిరోసిన్ పోసి నిప్పటించారని రజత్ తండ్రి కేహర్ ఆరోపించారు. మరోవైపు రజత్ తానే ఒంటికి నిప్పంటించుకున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో గ్రామ మాజీ పెద్ద రాం స్వరూప్‌పై, అతని కుటుంబ సభ్యులపై కేసు పెట్టామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement