పెళ్లి రద్దు చేసుకుంటే.. తప్పదు భారీ మూల్యం | cost to be paid if anybody cancels engagement, says supreme court | Sakshi
Sakshi News home page

పెళ్లి రద్దు చేసుకుంటే.. తప్పదు భారీ మూల్యం

Jul 23 2016 10:51 AM | Updated on Sep 2 2018 5:24 PM

నిశ్చితార్థం అయిన తర్వాత.. అమ్మాయి నచ్చలేదనో, మరేదైనా కారణం వల్లో దాన్ని రద్దు చేసుకోవాలనుకుంటే మాత్రం ఇక మీదట భారీ మూల్యం చెల్లించక తప్పదు.

నిశ్చితార్థం అయిన తర్వాత.. అమ్మాయి నచ్చలేదనో, మరేదైనా కారణం వల్లో దాన్ని రద్దు చేసుకోవాలనుకుంటే మాత్రం ఇక మీదట భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఈ విషయం ఢిల్లీలోని ఓ కుటుంబానికి మూడేళ్ల తర్వాత తెలిసొచ్చింది. 2012 సంవత్సరంలో ఓ ప్రభుత్వ వైద్యుడు తన  కొడుకును మహారాష్ట్రలోని థానెకు చెందిన అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. అన్నీ బాగానే ఉన్నాయనుకుని నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. నిశ్చితార్థాన్ని ఆ అమ్మాయి కుటుంబం చాలా ఘనంగా చేసింది. పెళ్లికొడుకు కుటుంబ సభ్యులు, స్నేహితులు అంతా వచ్చారు.

కానీ.. అమ్మాయి గురించిన నిజాలు సరిగా చెప్పకుండా దాచిపెట్టారని ఆరోపిస్తూ.. అబ్బాయి కుటుంబ సభ్యులు నిశ్చితార్థాన్ని రద్దుచేసుకున్నారు. దాంతో ఒళ్లు మండిన అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయిపైన, అతడి తండ్రిపైన ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు పెట్టారు. థానె కోర్టులో విచారణ జరిగింది. అమ్మాయి తల్లిదండ్రులకు ఖర్చుల కింద లక్షన్నర చెల్లించాలని కోర్టు సూచించింది. అయితే, తాము రూ. 4.50 లక్షలు ఖర్చుపెట్టామని అబ్బాయి తల్లిదండ్రులు వాదించారు. కానీ, అమ్మాయి కుటుంబానికి డబ్బు కట్టాల్సిందేనని కోర్టు చెప్పడంతో.. ఆ డబ్బు చెల్లించారు. అయినా అమ్మాయి తరఫు వాళ్లు కేసు ఉపసంహరించుకోలేదు. కేసు కొట్టేయాలంటూ అ‍బ్బాయి తరఫు వాళ్లు బాంబే హైకోర్టుకు వెళ్లినా, అక్కడా చుక్కెదురైంది. చివరకు సుప్రీంకోర్టుకు వెళ్లగా.. అమ్మాయి కుటుంబానికి పరిహారం కడితే సరిపోతుందని.. ఇందులో మోసం చేయడం ఏమీ లేదని జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement