‘నగ్మా’ రచ్చ! | clashes in tamil nadu congress | Sakshi
Sakshi News home page

‘నగ్మా’ రచ్చ!

Oct 17 2015 12:54 PM | Updated on Mar 18 2019 9:02 PM

‘నగ్మా’ రచ్చ! - Sakshi

‘నగ్మా’ రచ్చ!

రాష్ట్ర కాంగ్రెస్‌లో సినీ నటి, ఏఐసీసీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి నగ్మా హాట్ టాపిక్‌గా మారారు.

చెన్నై : రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూపులకు కొదవ లేదు. ఇదే రాజకీయం మహిళా విభాగంలోనూ సాగుతూ వస్తోంది. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాల్ని చేజిక్కించుకునేందుకు పలువురు సీనియర్ మహిళా నేతలు తీవ్రంగానే కుస్తీలు పట్టారు. చివరకు ఆ పదవి ఎమ్మెల్యే విజయధరణిని వరించింది. ఈ నియామకంతో గ్రూపులు మరింతగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌లో నటీమణుల తాకిడి పెరగడం, వారికి పెద్ద పదవులే కట్టబెట్టడం జరుగుతోంది.

ఆ కోవలో నటి కుష్బు, నగ్మాలు కూడా తీసుకోవచ్చు. అయితే, ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా నగ్మాకు గ్రూపు సెగ పెద్దగానే తగిలినట్టు సమాచారం. అదే సమయంలో గ్రూపులకు కళ్లెం పెట్టే రీతిలో వ్యవహరించే క్రమంలో చివరకు నగ్మా రచ్చకెక్కారు. నగ్మా గురువారం విమానాశ్రయంలో వ్యవహరించిన తీరు వివాదాస్పదం కావడంతో మహిళా నేతలు అగ్గిమీద గుగ్గిలంలా మండి పడుతున్నారు.

మహిళా కాంగ్రెస్ ఇన్‌చార్జ్ నగ్మా చెన్నైకు వస్తున్న సమాచారం ఢిల్లీ నుంచి రావడంతో ఆహ్వాన ఏర్పాట్లకు ఓ కమిటీని రాష్ర్ట అధ్యక్షురాలు విజయధరణి నియమించారు. ఈ క్రమంలో గురువారం రాత్రి చెన్నైకు చేరుకున్న నగ్మాను ఆహ్వానించేందుకు వెళ్లిన మహిళా కాంగ్రెస్ వర్గాలకు పెద్ద షాక్ తగిలినట్టు సమాచారం. దీంతో ఆహ్వానం పలికేందుకు వెళ్లిన వారు ఆగమేఘాలపై విజయధరణికి ఫిర్యాదు చేసినట్టు, తక్షణం స్పందించిన ఆమె నగ్మాను ఫోన్లో సంప్రదించినట్టు తెలిసింది. దీంతో వ్యవహారం ముదిరినట్టైంది. శుక్రవారం సత్యమూర్తి భవన్‌లో జరగాల్సిన కార్యక్రమాన్ని సైతం నగ్మా రద్దు చేసుకోవడం గమనార్హం.

మరోవైపు మహిళా కాంగ్రెస్‌లోని గ్రూపు సెగ కారణంగానే ఆహ్వానాన్ని తిరస్కరించి, శుక్రవారం సత్యమూర్తి భవన్‌కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నగ్మాకు ఏర్పడ్డట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా నగ్మా నియామకాన్ని కుష్బుతో పాటుగా పలువురు గ్రూపు మహిళా నాయకులు వ్యతిరేకిస్తున్నట్టుగా ఇప్పటికే ప్రచారం ఉంది. మహిళా ఇన్‌చార్జ్ వస్తున్న వేళ నాయకులెవ్వరూ కానరాక పోవడం, కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించే యత్నం చేయడంతోనే నగ్మా వారి ఆహ్వానాన్ని తిరస్కరించినట్టు చెబుతున్నారు.

అయితే, మహిళా కాంగ్రెస్ వర్గాల వాదన మరోలా ఉంది. నగ్మా చర్యల్ని ఖండిస్తున్నామని, ఆమెపై అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నామని మండి పడుతున్నారు. అయితే, ఇంతకీ నగ్మా ఆహ్వానం తిరస్కరించడానికి కారణాన్నిమహిళా కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేయడం లేదు. అయితే, టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ సమక్షంలో రాష్ట్ర వ్యవహారాల బాధ్యతలు స్వీకరిస్తారనుకున్నకార్యకర్తలకు భంగపాటు తప్పలేదు. దీంతో ఆమె తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు ద్వారా అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి సమాయత్తం అవుతున్నారు. వచ్చీరాగానే, రాష్ట్ర కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా నగ్మా రచ్చకెక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement