రేప్ చేస్తామని బెదిరిస్తున్నారు!
రేప్ చేస్తామంటూ కొందరు, యాసిడ్ పోసి ముఖాన్ని నామరూపాలు లేకుండా మాడ్చేస్తామని మరికొంత మంది మత ఛాందసవాదులు బెదిరిస్తున్నారు.
బెంగళూరు: హిందువుల మత విశ్వాసాలను ప్రశ్నించడమే కాకుండా ముస్లింలు గోమాంసం తినడం సబబేనంటూ సామాజిక వెబ్‌సైట్లలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న బెంగళూరుకు చెందిన కన్నడ సినిమాల అసోసియేట్ డెరైక్టర్, స్క్రిప్ట్ రైటర్ చేతన తీర్థహల్లికి అదే సామాజిక వెబ్‌సైట్ల ద్వారా తీవ్ర బెదిరింపులు ఎదురవుతున్నాయి. రేప్ చేస్తామంటూ కొందరు, యాసిడ్ పోసి ముఖాన్ని నామరూపాలు లేకుండా మాడ్చేస్తామని మరికొంత మంది మత ఛాందసవాదులు బెదిరిస్తున్నారు.
ముస్లింలు గోమాంసం తినడాన్ని సమర్థిస్తూ నగరంలో ఇటీవల జరిగిన సాహితీవేత్తలు, ఫెమినిస్టుల ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. ఇతర మతస్థుల విశ్వాసాలకు వ్యతిరేకమైన హిందూ మత విశ్వాసాలను విమర్శిస్తూ కూడా ఆమె పలు పత్రికల్లో పలు వ్యాసాలు కూడా రాశారు. బెంగళూరు ర్యాలీలో పాల్గొన్న నాటి నుంచి తనకు సామాజిక వెబ్‌సైట్ల ద్వారా బెదిరింపులు మొదలయ్యాయని, ఇటీవల ఫేస్‌బుక్‌లో మరి ఎక్కువయ్యాయని ఆరోపిస్తూ చేతన పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిలో మధుసూదన్ గౌడ అనే హిందూ రీసెర్చ్ స్కాలర్ కూడా ఉన్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
చేతన ఫిర్యాదు మేరకు తాము ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసి దర్యాప్తు చేస్తున్నామని, సామాజిక వెబ్‌సైట్ల ద్వారా బెదిరిస్తున్న వారిలో ఎక్కువ మంది దొంగ అకౌంట్లతోనే ఇలాంటి బెదిరింపులు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, దర్యాప్తు కొనసాగుతోందని నగర పోలీసులు మీడియాకు తెలిపారు.


