
కొండవలసకు కన్నీటి వీడ్కోలు
ప్రముఖ సినీ హాస్యనటుడు కొండవలస లక్ష్మణరావు(69) అంత్యక్రియలు గురువారం హైదరాబాద్ బల్కంపేటలోని ఈఎస్‌ఐ హిందూ శ్మశానవాటికలో నిర్వహించారు.
హైదరాబాద్: ప్రముఖ సినీ హాస్యనటుడు కొండవలస లక్ష్మణరావు(69) అంత్యక్రియలు గురువారం హైదరాబాద్ బల్కంపేటలోని ఈఎస్‌ఐ హిందూ శ్మశానవాటికలో నిర్వహించారు. శ్రీనగర్‌కాలనీలోని ఆయన స్వగృహం నుంచి భౌతికకాయాన్ని ప్రత్యేక వాహనంలో శ్మశానవాటికకు తీసుకువచ్చారు. కొండవలస చితికి కుమారుడు మణీధర్ నిప్పంటించారు. కుటుంబసభ్యులు, బంధువులు, సినీప్రముఖులు ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. అమెరికాలో ఉన్న కొండవలస కుమార్తె మాధురిప్రియ రాక ఆలస్యం కావడంతో భౌతికకాయాన్ని శ్రీనగర్‌కాలనీ నాగార్జుననగర్‌లోని తన నివాసంలో ఉంచారు.
గురువారం కుమార్తె వచ్చిన తర్వాత అంత్యక్రియలను జరిపించారు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన కొండవలస తమ మధ్య లేకపోవడం తీరనిలోటని పలువురు సినీ ప్రముఖులు అన్నారు. అంత్యక్రియల్లో సినీ ప్రముఖులు తనికెళ్ళ భరణి, శివాజీరాజా, కోడి రామకృష్ణ, ఎల్‌బీ శ్రీరాం, చలపతిరావు, కాదంబరి కిరణ్, వైజాగ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కొండవలసకు ఒక కుమర్తె, కుమారుడు ఉన్నారు.