నల్లధనం వయా సింగపూర్! | black money via singapoor | Sakshi
Sakshi News home page

నల్లధనం వయా సింగపూర్!

Oct 3 2015 4:04 AM | Updated on Apr 3 2019 5:16 PM

నల్లధనం వయా సింగపూర్! - Sakshi

నల్లధనం వయా సింగపూర్!

రాజధాని నిర్మాణం కోసం తాను అడగగానే సింగపూర్ ఉచితంగా మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇచ్చిందని గొప్పలు చెబుతున్నారు.,

- ఇక్కడి నుంచి అక్కడికి తరలించి, తిరిగి రప్పిస్తున్న నల్లకుబేరులు
- దేశంలోకి పెట్టుబడుల రూపంలో వస్తున్న అక్రమ సంపద
- భారత్ లోని కుంభకోణాల సొమ్ము సింగపూర్ కు..
- శారదా చిట్ ఫండ్ స్కామ్ సొమ్ములూ అక్కడికే
- పెట్టుబడులు, బ్యాంకింగ్ రహస్యాలను కాపాడుతున్న సింగపూర్
- సింగపూర్ పొట్ట విప్పిన 'సండే గార్డియన్'
అక్కడ పెట్టుబడులు పెట్టిన అప్పటి సీఎంనూ ప్రస్తావించిన పత్రిక

సాక్షి, హైదరాబాద్:
భారతీయ నల్లకుభేరులకు సింగపూర్ స్వర్గధామంగా మారిందా? తమ అక్రమసంపాదనను దాచుకోవడానికి, అడ్డదారుల్లో సంపాదించుకున్న సొమ్మును కాపాడుకోవడానికి వారు సింగపూర్‌ను ఎంచుకుంటున్నారా? అంటే.. ఔను అనే అంటోంది ‘సండే గార్డియన్’ పత్రిక.  నల్లధనం అక్రమాలకు సింగపూర్ స్వర్గధామంగా మారిందన్న అంశంపై ఆ పత్రిక ఇటీవల ఓ కథనాన్ని ప్రచురించింది. పశ్చిమ బంగాను కుదిపేస్తున్న శారదా చిట్‌ఫండ్ స్కామ్ అక్రమధనం సింగపూర్ తరలిందని ఆ పత్రిక పేర్కొంది.

దాంతో పాటు  కొన్నేళ్ల క్రితం సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన ఒకరు సింగపూర్‌లో హోటల్‌ను కొనుగోలు చేసిన వైనాన్ని కూడా ప్రస్తావిస్తూ ఆ పత్రిక సింగపూర్ పొట్ట విప్పింది. భారత్ నుంచి సింగపూర్‌కు వెళ్లిన నల్లధనం తిరిగి పెట్టుబడుల రూపంలో భారత్‌లోకి వస్తోందని విశ్లేషించింది. గణాంక సహితంగా వివరించింది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో సింగపూర్ ప్రమేయం, జోక్యం ఎక్కువవుతున్న నేపథ్యంలో, ఏపీ నూతన రాజధానిలో సింగపూర్ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడతాయన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటనల నేపథ్యంలో సింగపూర్ ప్రభుత్వ తీరు చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి నేపథ్యంలో ‘సండే గార్డియన్’ విశ్లేషణ కొత్త అనుమానాలకు తావిస్తోంది.

అసలేం జరుగుతోంది...?
అడ్డదారుల్లో సంపాదించిన సొమ్మును దాచుకోవడం కోసం స్విట్జర్లాండ్, మారిషస్ వంటి దేశాలకు భారత నల్లకుభేరులు పరుగెత్తేవారు. కానీ ఇటీవల అంతర్జాతీయంగా ఒత్తిళ్లు పెరగడంతో స్విట్జర్లాండ్, మారిషస్ దేశాలు తమ బ్యాంకుల్లో నల్లధనం దాచుకున్న వారి రహస్యాలను బహిర్గతం చేయకతప్పడం లేదు. దాంతో.. నల్లకుభేరులు అప్రమత్తమయ్యారు. వీరికి రాజకీయ సుస్థిరత, పెట్టుబడులకు పోత్సాహకరమైన వాతావరణం ఉన్న, ఆర్థికపరమైన ఆంక్షలను సడలించిన సింగపూర్ స్వర్గధామంగా కనిపిస్తోంది. దీంతో అక్రమ సొమ్మును సింగపూర్‌కు తరలిస్తున్న నల్లకుబేరులు... తర్వాత పెట్టుబడుల పేరుతో దాన్ని వైట్‌మనీగా తిరిగి దేశానికి తెప్పించుకుంటున్నారు.

అప్పటి సీఎం ఆస్తులు కేరాఫ్ సింగపూర్...  
గడిచిన దశాబ్దకాలంలో దేశంలోని అనేక మంది రాజకీయ వేత్తలు సింగపూర్‌లో ఆస్తులు కొనుగోలు చేశారు. కొన్నేళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి ఒకరు అక్కడ హోటల్‌లో పెట్టుబడులు పెట్టారని ‘సండే గార్డియన్’ పేర్కొంది. (ప్రపంచంలో అత్యంత ధనికుడైన రాజకీయవేత్తగా చంద్రబాబును పేర్కొంటూ, ఆయనకు సింగపూర్‌లో ఒక హోటల్ కూడా ఉందని, ఆ రోజుల్లోనే తెహల్కా పత్రిక ప్రకటించిన విషయం ఈ సందర్భంగా గమనార్హం.) ఇలా నల్లధనాన్ని సింగపూర్‌కు తరలిస్తున్న వైనంపై సమగ్ర విచారణ జరగాల్సి ఉందనీ ఒక అధికారి చెప్పార ని ‘సండే గార్డియన్’ పేర్కొంది.

పశ్చిమ బంగా రాష్ట్రాన్ని కుదిపేస్తోన్న శారద కుంభకోణంలో సూత్రధారులు, పాత్రదారులు దోచుకున్న సొమ్మును సింగపూర్‌లో పెట్టుబడి పెట్టినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఇటీవల ఆధారాలను సేకరించింది. శారద ట్రస్టు అధిపతి సుదీప్త సేన్, తృణమూల్ కాంగ్రెస్‌కి చెందిన ఓ సీనియర్ నేత దోచుకున్న సొమ్ముతో సింగపూర్‌లో ఓ హోటల్, ఆస్తులను కూడగట్టుకున్నారని సీబీఐ తేల్చింది. వారు మాత్రమేగాక దేశానికి చెందిన పలువురు రాజకీయవేత్తలు అడ్డదారుల్లో దోపిడీ చేసిన సొమ్ముతో సింగపూర్‌లో స్థిరాస్తులు పొగేసుకున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

భారతీయుల సంస్థల సంఖ్యనాలుగు వేలకు పైనే!
సిక్కి(సింగపూర్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) వెల్లడించిన వివరాల మేరకు సింగపూర్‌లో నాలుగు వేలకుపైగా భారతీయుల సంస్థలు ఉన్నాయి.   సింగపూర్‌లో నల్లధనాన్ని పెట్టుబడులు పెట్టిన మన దేశానికి చెందిన నల్లకుభేరులు ఆ దేశ పౌరసత్వం కోసం భారీ ఎత్తున దరఖాస్తులు చేసుకుంటున్నారని అధికారవర్గాలు వెల్లడిస్తోండటం గమనార్హం.

బాబు సింగపూర్ స్మరణ వెనుక ఆంతర్యమేమిటో!?
భారత్‌లో నమోదవుతున్న ఆర్థిక అక్రమాలకు సింగపూర్ కేరాఫ్‌గా మారిందన్న విశ్లేషణల నేపథ్యంలో, దీనిపై ఆధారాలు కూడా లభిస్తున్న నేపథ్యంలో కూడా సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చంద్రబాబు సింగపూర్ నామస్మరణ చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. రాజధాని నిర్మాణం కోసం తాను అడగగానే సింగపూర్ ఉచితంగా మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇచ్చిందని గొప్పలు చెబుతున్నారు. మాస్టర్ ప్లాన్ రూపొందించక ముందు, తర్వాత సింగపూర్‌లో పర్యటించిన చంద్రబాబు రాజధాని మాస్టర్ డెవలపర్‌గా సింగపూర్ కంపెనీలనే ఎంపిక చేసేలా మంత్రివర్గంలో తీర్మానించారు. ఈ నేపథ్యంలో సింగపూర్ పట్ల చంద్రబాబు దోరణిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మనదేశంలోని నల్లడబ్బే సింగపూర్‌కు తరలిపోయి, తిరిగి పెట్టుబడుల రూపంలో మనదేశానికి తరలివస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు సింగపూర్ పెట్టుబడుల వ్యవహారంపై కూడా సునిశిత పరిశీలన జరగాలన్న అభిప్రాయం వినిపిస్తోంది.
 

మూడేళ్లలో మూడింతలైన సింగపూర్ పెట్టుబడులు...
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం గడచిన మూడేళ్లలో సింగపూర్ నుంచి భారత్‌లోకి పెట్టుబడులు మూడింతలు పెరిగాయి. ఇదే సందర్భంలో మారిషస్ నుంచి దేశంలోకి ఎఫ్‌డీఐలు సగానికి సగం తగ్గడం గమనార్హం. ఉన్నఫలంగా ఇలాంటి మార్పుతో... సింగపూర్‌కు తరలిన అక్రమ సంపదే ఇలా పెట్టుబడుల రూపంలో తిరిగి వస్తోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సింగపూర్ ప్రభుత్వం రూపొందించిన పారిశ్రామిక విధానంతో నల్లకుభేరులకు ద్వారాలు తెరిచినట్లయ్యిందని ప్రముఖ ఆర్థికవేత్త గోపాల్ అగర్వాల్ విశ్లేషించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement