రేపు జరగబోయే ఎన్నికల్లో తగినన్ని స్థానాలు సాధించి, బీజేపీ గనక అధికారాన్ని నిలబెట్టుకోగలిగితే ఆ పార్టీ రికార్డు సృష్టిస్తుంది.
రేపు జరగబోయే ఎన్నికల్లో తగినన్ని స్థానాలు సాధించి, బీజేపీ గనక అధికారాన్ని నిలబెట్టుకోగలిగితే ఆ పార్టీ రికార్డు సృష్టిస్తుంది. ఎందుకంటే, ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో ఏ పార్టీ వరుసగా మూడుసార్లు అధికారంలో నిలబడలేదు. 2005లో శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. అంతకుముందు దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 1993 నుంచి 2003 వరకు పనిచేసింది. 2000 సంవత్సరంలో మధ్యప్రదేశ్ను విభజించి ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని ఏర్పాటుచేశారు. సమైక్య మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వాలేవీ పూర్తిగా ఐదేళ్ల పాటు పాలించలేకపోయాయి. కానీ, 2003 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ రికార్డును బీజేపీ బద్దలుకొట్టింది. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ తన అధికారాన్ని నిలబెట్టుకుంది.
ఈసారి కూడా అభివృద్ధి మంత్రంతో శివరాజ్ సింగ్ చౌహాన్ గెలిచి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో రెండు పార్టీల నుంచి జాతీయస్థాయి నాయకులు ముమ్మరంగా ప్రచారం చేశారు. రేపు జరగనున్న పోలింగ్లో మొత్తం 4,64,57,724 మంది ఓటర్లు 53,896 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటుహక్కు వినియోగించుకుంటారు. 51 జిల్లాలున్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 230 నియోజకవర్గాలు ఉండగా మొత్తం 2,583 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అభివృద్ధి మంత్రంతో బీజేపీ దూసుకెళ్తుండగా, కాంగ్రెస్ మాత్రం అందులో అవినీతి దాగి ఉందంటూ తిప్పికొడుతోంది. మొత్తానికి ఓటరు దేవుళ్లు ఏమంటారో మాత్రం వేచిచూడాల్సిందే.