ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడులు పెరిగిపోతున్నాయి. స్వదేశాన్ని వదిలి చదువుకోసం వచ్చిన భారతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి.
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడులు పెరిగిపోతున్నాయి. స్వదేశాన్ని వదిలి చదువుకోసం వచ్చిన భారతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. మనిరాజ్విందర్ సింగ్ అనే భారత విద్యార్థిపై ఆదివారం జరిగిన దాడితో సంబంధమున్న ముఠాలోని సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడికి పాల్పడిన వారిలో ఆస్ట్రేలియాకు చెందిన 17ఏళ్ల యువకుడు సీదెన్హాంను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆ యువకుడు బెయిల్ కోరుతూ చిల్డ్రన్స్ కోర్టును అశ్రయించాడు. విచారణకు స్వీకరించిన కోర్టు నిందితుడు ఉద్దేశపూర్వకంగానే భారతీయులపై దాడికి పాల్పడినట్టు అభిప్రాయపడింది. దీంతో అతడికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్టు కోర్టు వెల్లడించింది.
మెల్బోర్న్లోని బిర్రాంగ్ మర్ పార్క్ సమీపంలోని ప్రిన్సెస్ బ్రిడ్జ్ వద్ద కూర్చుని ఇద్దరు స్నేహితులతో సంభాషిస్తున్న మనిరాజ్విందర్ సింగ్పై ఆదివారం ఎనిమిది మంది సభ్యుల బృందం దాడి చేసిన సంగతి తెలిసిందే. మనిరాజ్విందర్ సింగ్ ఇంకా కోమాలో ఉన్నాడని, కానీ, ఎలాంటి ప్రమాదం లేదని అతడి సోదరుడు యద్వేంధర్ సింగ్ తెలిపాడు. ప్రస్తుతం భారత్లో ఉన్న మనిరాజ్విందర్ సింగ్ తల్లిదండ్రులు మెల్బోర్న్ రప్పించేందుకు కావాల్సిన వీసా ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నట్టు మెల్బోర్న్ అధికారులు తెలిపారు.