breaking news
Manrajwinder Singh
-
భారతీయులే లక్ష్యంగా ఆస్ట్రేలియాలో దాడులు
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో భారతీయులపై దాడులు పెరిగిపోతున్నాయి. స్వదేశాన్ని వదిలి చదువుకోసం వచ్చిన భారతీయ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. మనిరాజ్విందర్ సింగ్ అనే భారత విద్యార్థిపై ఆదివారం జరిగిన దాడితో సంబంధమున్న ముఠాలోని సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడికి పాల్పడిన వారిలో ఆస్ట్రేలియాకు చెందిన 17ఏళ్ల యువకుడు సీదెన్హాంను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆ యువకుడు బెయిల్ కోరుతూ చిల్డ్రన్స్ కోర్టును అశ్రయించాడు. విచారణకు స్వీకరించిన కోర్టు నిందితుడు ఉద్దేశపూర్వకంగానే భారతీయులపై దాడికి పాల్పడినట్టు అభిప్రాయపడింది. దీంతో అతడికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్టు కోర్టు వెల్లడించింది. మెల్బోర్న్లోని బిర్రాంగ్ మర్ పార్క్ సమీపంలోని ప్రిన్సెస్ బ్రిడ్జ్ వద్ద కూర్చుని ఇద్దరు స్నేహితులతో సంభాషిస్తున్న మనిరాజ్విందర్ సింగ్‌పై ఆదివారం ఎనిమిది మంది సభ్యుల బృందం దాడి చేసిన సంగతి తెలిసిందే. మనిరాజ్విందర్ సింగ్ ఇంకా కోమాలో ఉన్నాడని, కానీ, ఎలాంటి ప్రమాదం లేదని అతడి సోదరుడు యద్వేంధర్ సింగ్ తెలిపాడు. ప్రస్తుతం భారత్‌లో ఉన్న మనిరాజ్విందర్ సింగ్ తల్లిదండ్రులు మెల్బోర్న్ రప్పించేందుకు కావాల్సిన వీసా ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నట్టు మెల్బోర్న్ అధికారులు తెలిపారు. -
గాయపడిన భారతీయుడి పరిస్థితి విషమం
ఆస్ట్రేలియాలో స్థానికుల దాడిలో గాయపడిన భారతీయ విద్యార్థి మనిరాజ్విందర్ సింగ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అతడి సోదరుడు యద్వేందర్ సింగ్ గురువారం ఇక్కడ వెల్లడించారు. ఆల్ఫ్రెడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మనిరాజ్విందర్ సింగ్ ఇంకా కోమాలోనే ఉన్నాడని, అయితే వైద్యులు అందించే మందులకు మనిరాజ్విందర్ బాగానే స్పందిస్తున్నాడని తెలిపారు. తన సోదరుడికి ఆల్ఫ్రెడ్ ఆసుపత్రి వైద్యులు మెరుగైన వైద్యం అందించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అలాగే తన సోదరుడిపై దాడికి తెగబడిన నిందితలలో ముగ్గురని అరెస్ట్ చేయడం పట్ల విక్టోరియా పోలీసులను ఆయన అభినందించారు. గత ఆదివారం మెల్బోర్న్లోని ప్రిన్సెస్ బ్రిడ్జ్‌పై మనిరాజ్విందర్ సింగ్ మరో ఇద్దరి స్నేహితులతో కలసి ఉండగా, ఎనిమిది మంది వ్యక్తులతో కూడిన బృందం ఒకటి మనిరాజ్విందర్తోపాటు మరో స్నేహితుడిపై దాడికి తెగబడింది. అనంతరం వారు పరారయ్యారు. బృందం చేసిన దాడిలో మనిరాజ్విందర్ తలకు తీవ్రంగా గాయమై కోమాలోకి వెళ్లగా మరోకరు గాయపడ్డారు. దాంతో స్థానికులు మనిరాజ్విందర్ను అతడి స్నేహితుడిని ఆల్ఫ్రెడ్ ఆసుపత్రికి తరలించారు. ఆ దాడిపై విక్టోరియా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మన్విందర్ సింగ్ ఆస్ట్రేలియాలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న సంగతి తెలిసిందే. మనిరాజ్విందర్ సింగ్ పరిస్థితిపై ఆస్ట్రేలియాలో భారతీయ రాయబార కార్యాలయాన్ని ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.