తాత్కాలిక వీసాల తిరస్కరణకు కెనడా చట్టసవరణ?
ఇమిగ్రేషన్ విభాగానికి మూకుమ్మడి తిరస్కరణ అధికారాలు
ఈ ఏడాది ఆగస్టులో 74 శాతం భారత విద్యార్థి వీసాల తిరస్కరణ
న్యూఢిల్లీ: కెనడాలో ప్రభుత్వం మారినా, ప్రధాని మారినా భారత వ్యతిరేక విధానాల్లో ఏ మార్పూ రాలేదు. భారతీయుల వీసాలను తిరస్కరించటమే లక్ష్యంగా ఆ దేశం వలస, ఆశ్రయ చట్టానికి సవరణలు ప్రతిపాదించటమే అందుకు ఉదాహ రణగా నిలుస్తోంది. కెనడా ప్రభుత్వం ఇటీవల ఆ దేశ ఇమిగ్రేషన్ డిపార్ట్‌మెంట్‌కు మరిన్ని అధికారాలు కట్టబెట్టేలా చట్ట సవరణకు అనుమతి ఇచ్చినట్టు సీబీసీ న్యూస్ సంస్థ వెల్లడించింది. ఇమిగ్రేషన్, రిఫ్యూజీ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (ఐఆర్‌సీసీ), కెనడా బోర్డర్ సర్వీస్ ఏజెన్సీ (సీబీఎస్‌ఏ) నుంచి సేకరించిన పత్రాలను విశ్లేషించి సీబీసీ న్యూస్ ఈ వివరాలు వెల్లడించింది.
దీని ప్రకారం తాత్కాలిక నివాస వీసాల (టీఆర్‌వీ)ను గంపగుత్తగా తిరస్కరించేందుకు ఇమిగ్రేషన్ విభాగానికి అధికారాలు దఖలుపడేలా చట్టసవరణ ప్రతిపాదించారు. ఇందులో ముఖ్యంగా భారత్, బంగ్లాదేశ్ పౌరులనే టార్గెట్ చేస్తూ ఈ మార్పులు ప్రతిపాదించారని సీబీసీ కథనంలో పేర్కొంది. ఎవరిదైనా వీసా తిరస్కరించాలంటే దానిపై ప్రత్యేకంగా విచారణ జరిపి, దుర్వినియోగం అయ్యిందని తేలితే చర్యలు తీసుకుంటారు.
కానీ, ఇకపై ఒక్కో కేసును కాకుండా మూకుమ్మడిగా వీసాలను తిరస్కరించేందుకు ఈ మార్పులు చేస్తున్నట్లు చెబుతున్నారు. కెనడా ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో భారతీయ విద్యార్థుల నుంచి వచ్చిన వీసా దరఖాస్తుల్లో 74 శాతం దరఖాస్తులను తిరస్కరించిందని రిపోర్టులు చెబుతున్నాయి. అదే నెలలో చైనా నుంచి వచ్చిన విద్యార్థి వీసాల్లో 24 శాతం మాత్రమే తిరస్కరణకు గురయ్యాయి. 2023 ఆగస్టులో భారతీయ విద్యార్థి వీసాల తిరస్కరణ రేటు 32 శాతం మాత్రమే.
పెరుగుతున్న ఆశ్రయ దరఖాస్తులు
కొన్నేళ్లుగా భారత్ నుంచి కెనడాల్లో ఆశ్రయం కోసం దరఖాస్తులు పెరుగుతున్నాయి. 2024లో అంతర్జాతీయ విద్యార్థుల నుంచి కెనడాకు 20,245 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో భారత్, నైజీరియా నుంచే అధికంగా ఉన్నాయి. 2023 మేలో భారత్ నుంచి ఆశ్రయం కోరుతూ వచ్చిన విద్యార్థుల దరఖాస్తులు 500 వరకు ఉండగా, 2024 జూలై నాటికి నెలకు 2,000లకు పెరిగాయి.
వీటికి అడ్డుకట్ట వేసే లక్ష్యంతో ఇమిగ్రేషన్ చట్టంలో సవరణలు ప్రతిపాదించినట్టు సీబీసీ పేర్కొంది. కెనడా నిర్ణయంపై వలసల హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశాయి. కెనడా ప్రభుత్వం తన ప్రయత్నాలను మానుకోవాలని దాదాపు 300 సంఘాలు విజ్ఞప్తి చేశాయి. చట్ట సవరణ అమలైతే ప్రస్తుతం అమెరికా నుంచి విదేశీయులను గెంటివేస్తున్నట్టుగానే కెనడా నుంచి కూడా విదేశీయులను మూకుమ్మడిగా గెంటేస్తారని ఇమిగ్రేషన్ న్యాయవాదులు ఆందోళన వ్యక్తంచేశారు.


