ప్రయాణమే కాదు.. ప్రాణాలూ గాల్లోనే!!

ప్రయాణమే కాదు.. ప్రాణాలూ గాల్లోనే!!


(సాక్షి వెబ్ ప్రత్యేకం)

ప్రేమించిన యువతి తనను నిరాకరించిందని.. ఏకంగా విమానాన్ని కూల్చేసి 150 మంది ప్రాణాలు తీస్తాడో కో-పైలట్. సాక్షాత్తు కేంద్ర మంత్రిగా ఉండి... అదీ విమానయాన శాఖ మంత్రిగా ఉండి కూడా విమానంలోకి అగ్గిపెట్టెలు, లైటర్లు తీసుకెళ్తారు మరో పెద్దమనిషి. అటు చేసి ఇటు చేసి మొత్తమ్మీద ప్రయాణికుల ప్రాణాలను గాల్లో దీపాల్లా మార్చేస్తున్నారు వీళ్లంతా. 9/11 దాడులు జరిగిన తర్వాత నుంచి అంతర్జాతీయంగా వైమానిక భద్రత మీద అన్ని దేశాలు గట్టిగానే దృష్టి సారించాయి. వీఐపీ అయినా కూడా కట్టుదిట్టమైన భద్రతా పరీక్షలు లేకుండా నేరుగా లోపలకు వెళ్లే అవకాశం దాదాపుగా లేదు. ప్రధానమంత్రులు, వివిధ దేశాల అధ్యక్షుల లాంటి వాళ్లకు మాత్రమే దీన్నుంచి మినహాయింపు ఉంటుంది. కానీ ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నా గాల్లో ప్రయాణం అంటే.. ప్రాణాలు ఎక్కడ గాల్లో కలిసిపోతాయోనన్న ఆందోళన మాత్రం తప్పడం లేదు. ఎక్కిన విమానం గమ్యం వరకు చేరుకుంటుందో.. మధ్యలోనే గుటుక్కుమంటుందో తెలియక అసలు విమానం ఎక్కాలంటేనే భయపడాల్సి వస్తోంది.



తాను కేంద్ర మంత్రిని అయిన తర్వాత ఎవరూ చెక్ చేయడం లేదని, దాంతో విమానంలో వెళ్తున్నా కూడా జేబులో అగ్గిపెట్టె పెట్టుకునే వెళ్తున్నానని స్వయంగా పౌర విమానయాన శాఖ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు చెప్పారు. ఇలా అగ్గిపెట్టెలు, లైటర్లను తీసుకెళ్తే.. వాటిని ఎవరైనా లాక్కుని విమానానికి ప్రమాదం తలపెట్టే అవకాశం సైతం లేకపోలేదు. ఆ విషయం తెలిసి, స్వయంగా అదే శాఖకు మంత్రి అయి ఉండి కూడా కేవలం సిగరెట్ల అలవాటు మానుకోలేక.. దానికి ఇబ్బంది అవుతుందని రాజుగారు అగ్గిపెట్టెలో, లైటర్లో తీసుకెళ్తున్నారు.



ఒకప్పుడు బేగంపేటలోనే హైదరాబాద్ విమానాశ్రయం ఉన్నప్పుడు.. లోపల వరకు కూడా వెళ్లి విమానాలను దగ్గర నుంచి చూసే అవకాశం ఉండేది, అలాగే మనవాళ్లు సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటే వాళ్లను రిసీవ్ చేసుకునేందుకూ బాగా అవకాశం ఉండేది. కానీ తర్వాతి కాలంలో భద్రతా చర్యలు కట్టుదిట్టం కావడంతో అవన్నీ ఆపేశారు. అయినా కూడా ఏవో ఒక ప్రమాదాలు, కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు మరో కొత్త పరిణామం.. విమానాలు రన్వే నుంచి పక్కకు జారిపోవడం. నిన్న కాక మొన్న అమెరికా విమానం ఒకటి ఇలా అయితే, తాజాగా జపాన్లో కూడా మరో విమానం రన్వే నుంచి పక్కకు జారిపోయింది. ఇలా ఎందుకు జరుగుతోందో తెలియదు గానీ, దీనివల్ల ప్రయాణికులు మాత్రం తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఇలాంటి అడ్డంకులన్నీ తొలగిపోయి.. విమాన ప్రయాణాలు సురక్షితం అని ఎప్పటికి చెప్పగలరో చూడాలి మరి!!


-పి.ఆర్.ఆర్. కామేశ్వరరావు

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top