
నటి మృతి కేసు: లొంగిపోయిన యువ హీరో
రోడ్డు ప్రమాదంలో బెంగాల్ నటి, మోడల్ సోనికా చౌహాన్ మరణించిన కేసులో యువ నటుడు విక్రమ్ ఛటర్జీ కోర్టులో లొంగిపోయాడు.
కోల్‌కతా: రోడ్డు ప్రమాదంలో బెంగాల్ నటి, మోడల్ సోనికా చౌహాన్ మరణించిన కేసులో యువ నటుడు విక్రమ్ ఛటర్జీ కోర్టులో లొంగిపోయాడు. ఈ కేసు విచారణలో పోలీసులకు సహకరిస్తానని కోర్టుకు హామీ ఇచ్చాడు. 1000 రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. సెప్టెంబర్ 1న కేసు తదుపరి విచారణకు హాజరు కావాల్సిందిగా విక్రమ్‌ను ఆదేశించింది.
గత శనివారం సోనికా, విక్రమ్ ఇద్దరూ కలిసి కారులో వెళుతుండగా అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు కారులో చిక్కుకున్న వీరిద్దరినీ వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సోనికా మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. తలకు తీవ్ర గాయమైన విక్రమ్‌కు ఐసీయూలో చికిత్స అందించారు. సోనికా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కోల్‌కతా పోలీసులు విక్రమ్‌పై కేసు నమోదు చేశారు. వేగంగా, నిర్లక్ష్యంగా కారు నడిపి తమ కుమార్తె మరణానికి కారణమయ్యాడని ఫిర్యాదు చేశారు. గురువారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన విక్రమ్ ఈ రోజు కోర్టు ఎదుట హాజరయ్యాడు.