మహిళలకే ప్రాధాన్యం

Womens Given Importance In Local Body Elections - Sakshi

ఒక్కటి తప్ప.. అన్నీ మహిళలకే 

ఎంపీపీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు ఖరారు 

సాక్షి, కొల్లాపూర్‌: దాదాపు అన్ని మండలాలకు ఎంపీపీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కొల్లాపూర్‌ నియోజకవర్గ మండలాలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. నాలుగు మండలాల్లో  ఒక్క ఎంపీపీ పదవి మినహా మిగతా ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలన్నీ మహిళలకే రిజర్వ్‌ అయ్యాయి. జనాభా పరంగా ఎస్సీలు, ఎస్టీలు పెద్దసంఖ్యలో ఉన్నారు. అయితే వీరికి ఎక్కడా రిజర్వేషన్లు కల్పించలేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగిందని రాజకీయ పార్టీల నాయకులు భావిస్తున్నారు.

మండలాల వారీగా ఇలా..
నియోజకవర్గ పరిధిలో కొల్లాపూర్, పెంట్లవెల్లి, పెద్దకొత్తపల్లి, కోడేరు మండలాలు ఉన్నారు. వీటిలో ఎంపీపీ పదవులకు సంబంధించి కొల్లాపూర్‌ మండలం జనరల్‌ మహిళ, కోడేరు మండలం జనరల్‌ మహిళ, పెంట్లవెల్లి మండలం బీసీ మహిళ, పెద్దకొత్తపల్లి మండలం బీసీ మహిళకు రిజర్వ్‌ అయ్యాయి. జెడ్పీటీసీ పదవులకు సంభందించి కొల్లాపూర్‌ మండలం జనరల్‌ మహిళ, పెంట్లవెల్లి మండలం బీసీ మహిళ, కోడేరు మండలం జనరల్‌ మహిళ, పెద్దకొత్లపల్లి మండలం బీసీ జనరల్‌ అయ్యాయి.

గతంలో ఇలా.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొల్లాపూర్‌ నియోజకవర్గంలో కేవలం ఐదు మండలాలు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం నియోజకవర్గంలో  ఏడు మండలాలు ఉన్నాయి. వీటిలో చిన్నంబావి, వీపనగండ్ల, పాన్‌గల్‌ మండలాలు వనపర్తి జిల్లా పరిధిలోకి వెళ్లాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా పరిధిలో ఉండే మండలాలకు సంభందించి గతంలో కొల్లాపూర్‌ మండలంలో ఎంపీపీ, జెడ్పీటీసీ పదవులు జనరల్‌ స్థానాలకు, పెద్దకొత్తపల్లి మండంలలో ఎంపీపీ స్థానం జనరల్‌కు, జడ్పీటీసీ స్థానం బీసీ జనరల్‌కు, కోడేరు మండలంలో ఎంపీపీ, స్థానం జనరల్‌కు, జెడ్పీటీసీ స్థానం ఎస్టీలకు రిజర్వ్‌ చేశారు. ఈసారి వీటికి పూర్తి భిన్నంగా ఒక్క స్థానం మినహాయిస్తే మిగతా అన్ని స్థానాలు మహిళలకే రిజర్వ్‌ అయ్యాయి.

ఆశావహుల లెక్కలు
ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆయా స్థానాల్లో పోటీలో నిలవాలని భావిస్తున్న ఆశావహులు రాజకీయంగా లెక్కలు వేసుకునే పనిలో పడ్డారు. కొల్లాపూర్, కోడేరు, పెంట్లవెల్లిలో ఎంపీపీ, జెడ్పీటీసీలన్నీ మహిళలకే రిజర్వ్‌ కావడంతో నాయకులు పోటీలో ఉండాలా లేదా అనే ఆలోచనలో పడ్డారు. అయినా సరే ప్ర త్యర్థి పార్టీ అభ్యర్థి బలాబలాను బేరీజు వేసుకుని బరిలో దిగేందుకు సమాయత్తమవుతున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top