
సాక్షి, నాగోలు: వంట చేయటం లేదంటూ భర్త తిట్టాడనే కోపంతో ఓ మహిళ ఆత్మహత‍్మకు పాల్పడింది. ఈ ఘటన ఎల్‌బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన సూదిని శ్రీలత (23)కు అదే ప్రాంతానికి చెందిన అనంతరెడ్డితో ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం అయింది. ఈ దంపతులు బైరామల్‌గూడ సాయినగర్ కాలనీలో నివాసముంటున్నారు.
శ్రీలతకు వంట చేయటం రాదని పెళ్లికి ముందే కుటుంబసభ్యులు చెప్పారు. అయినా, తాము నేర్పించుకుంటామంటూ అనంతరెడ్డి నగరానికి తీసుకువచ్చాడు. గత కొన్ని రోజుల నుంచి భర్త అనంతరెడ్డి వంట చేయటం లేదంటూ భార్యను వేధిస్తున్నాడు. ఈ నెల 16న భర్త ఇంట్లో లేని సమయంలో ఒంటికి నిప్పటించుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమె గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందింది. శ్రీలత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు ఎల్‌బీనగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.