కొడుకులా.. కర్కోటకులా..!

Without compassion, the parents were beaten - Sakshi

కనికరం లేకుండా తల్లిదండ్రులను గెంటేశారు

రాత్రంతా చలికి వణుకుతూ ఆరుబయటే ఉన్న వృద్ధ దంపతులు

మునుగోడు: నవమాసాలు మోసి కనిపెంచారు.. కంటికి రెప్పలా కాపాడారు. వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటారని బోలెడన్ని ఆశలూ పెట్టుకున్నారు. చెట్టంత కొడుకులు చేదోడుగా ఉంటారని వారు ‘కన్న’కలలు కల్లలయ్యాయి. ఆ కొడుకులే కర్కో టకులయ్యారు. కనికరం లేకుండా తల్లిదండ్రులను గెంటేశారు. సామానంతా బయట పడేయడంతో ఎముకలు కొరికే చలిలో ఆ వృద్ధ దంపతులు పడిన ఇబ్బందులు చూసి చలించనివారుండరు. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. మునుగోడు గ్రామ పంచాయతీ పరిధిలోని లక్ష్మిదేవిగూడేనికి చెందిన నారగోని ముత్యాలు(65), మంగమ్మ (62) దంపతులకు నలుగురు కుమారులు. ఇరవై ఏళ్ల క్రితం నలుగురిలో ముగ్గురికి వివాహం చేశారు. ఆ సమయంలోనే ఆస్తులను సమ భాగాలుగా పంచి ఇచ్చి వేరు కాపురం పెట్టించారు. వివాహం కాని చిన్న కొడుకుకు కూడా భాగం ఇచ్చి తల్లిదండ్రులు అతనితో ఉండేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఇంట్లో ఒక గది తీసుకొని అతనితోపాటు ఉంటున్నారు. చిన్న కుమారుడికి వివాహం కాగానే, అతను కూడా వేరు పడ్డాడు. అదే ఇంట్లో ఉంటున్న ముత్యాలు, మంగమ్మ దంపతులు నలుగురు కుమారుల వద్ద ఖర్చులకు డబ్బులు తీసుకుని సొంతంగా వండుకుంటున్నారు.

నెల రోజులుగా చిన్న కుమారుడు తన ఇంట్లో ఉండ వద్దని నిత్యం గొడవ పడుతున్నాడు. వారికి వేరే చోట ఉండేందుకు గూడు లేకపోవడంతో అదే ఇంట్లో మాటలు పడుతూ జీవనం సాగిస్తున్నారు. దీంతో తాను ఎంత చెప్పినా వినడంలేదని ఆగ్రహించిన చిన్న కుమారుడు తల్లిదండ్రుల సామగ్రిని బుధవారం రాత్రి వీధిలో పడేశాడు. ఏం చేయాలో దిక్కుతోచక రాత్రంతా చలికి వణుకుతూ ఆరుబయటే తల్లిదండ్రులు ఉండిపోయారు. గురువారం సామాన్లు పెట్టుకుని వంట చేసుకున్నారు. నలుగురిలో ఇద్దరు కుమారులు మాత్రం మీకు ఇచ్చిన ఇంట్లోనే ఉండాలని, తామెలా తీసుకెళ్తామని అంటుండగా, మరో ఇద్దరు మాత్రం చడీచప్పుడు చేయడం లేదని వృద్ధ దంపతులు ముత్యాలు, మంగమ్మ తెలిపారు. తమను కుమారులు పట్టించుకోవడం లేదని, వారిని చట్టపరంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని గురువారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top