4 లక్షల డాలర్లు ఎవరివో?

Who's the winner of 4 lakh dollars? - Sakshi

జీఈఎస్‌లో స్టార్టప్‌ల పిచ్‌ కాంపిటీషన్‌

రేపే ఫైనల్‌.. సెమీఫైనల్‌కు 24 మంది.. వీరిలో 8 మంది భారతీయులు

సాక్షి, హైదరాబాద్‌: స్టార్టప్‌ల కోసం నిర్వహించిన పిచ్‌ కాంపిటీషన్‌లో ఎవరు విజేతగా నిలుస్తారు..? 4 లక్షల డాలర్ల(దాదాపు రూ.2.57 కోట్లు) ప్రైజ్‌ మనీని అందుకునే ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఎవరో రేపు(30న) సాయంత్రానికి తేలిపోనుంది. జీఈఎస్‌ ముగింపు వేడుకల్లో ఈ విజేతను ప్రకటించనున్నారు. పలు దేశాల నుంచి 90 మంది ఔత్సాహిక వ్యాపార వేత్తలు ఈ పోటీలో పాల్గొన్నారు.

తమ ఆలోచనలు, వ్యాపారాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు జీఈఎస్‌ ఈ పోటీని నిర్వహించింది. గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ త్రూ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(జీఐఎస్‌టీ) అధ్వర్యంలో అక్టోబర్‌ 20న పోటీ ప్రారంభమైంది.జీఈఎస్‌లో ఎంచుకున్న ఇంధనం–మౌలిక వసతు లు, హెల్త్‌ అండ్‌ లైఫ్‌ సైన్సెస్, డిజిటల్‌ ఎకానమీ, మీడియా–ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాల్లో కొత్త ఆలోచన లను ఆవిష్కరించిన స్టార్టప్‌ల నుంచి దరఖాస్తులను స్వీకరించింది.

ఈ నెల 8 నుంచి 24 వరకు వచ్చిన దరఖాస్తుల్లో స్కోర్‌ ఆధారంగా ఒక్కో రంగంలో ఆరుగురు చొప్పున 24 మందిని సెమీ ఫైనలిస్టులుగా ప్రకటించింది. వీరికి జీఈఎస్‌లో పాలుపంచుకునే అవకాశం కల్పించింది. సెమీ ఫైనల్‌లో స్టార్టప్‌లపై 3 నిమిషాల పిచ్, 5 నిమిషాల పాటు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. తమ వినూత్న ఆలోచనతో పాటు ప్రతిభతో న్యాయ నిర్ణేతలను ఆకట్టుకున్న వారు ఫైనల్‌కు చేరుకుంటారు.ఒక్కో రంగంలో ఒకరిని.. మొత్తం నలుగురిని ఫైనలిస్టులుగా పరిగణిస్తారు. వారికి తుది ఫైనల్‌ పోటీ ఉంటుంది. ఒక్కొక్కరు ఒకటిన్నర నిమిషాల్లో (90 సెకన్లు) ప్రదర్శన ఇవ్వటంతో పాటు 2 నిమిషాల్లోనే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.

ఇందులో నెగ్గిన వారిని ‘జిస్ట్‌ కాటలిస్ట్‌ పిచ్‌ కాంపిటీషన్‌ గ్రాండ్‌ చాంపియన్‌’గా ప్రకటిస్తారు. విజేతకు దాదాపు 4 లక్షల డాలర్ల పెట్టుబడి సాయం అందుతుంది. ఫైనల్‌కు చేరుకున్న నలుగురికి దాదాపు రెండు లక్షల డాలర్ల విలువైన బహుమతులు అందిస్తారు. జిస్ట్‌ పోటీలో సెమీ ఫైనల్‌కు చేరిన 24 మందిలో 8 మంది భారతీయులున్నారు. వీరిలో ఐదుగురు మహిళలే. హైదరాబాద్‌కు చెందిన మార్క్సియస్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ నిర్వాహకురాలు వైశాలి నియోటియాతో పాటు తదితరులు ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top