ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు! 

White coat hypertension in more than 35 percentage of the state - Sakshi

హైపర్‌ టెన్షన్‌ కనికట్టు 

రాష్ట్రంలో 35.9 శాతం మందిలో వైట్‌ కోట్‌ హైపర్‌టెన్షన్‌ 

14.3% మందిలో మాస్‌్కడ్‌ హైపర్‌టెన్షన్‌ ∙సరైన నిర్ధారణ జరగకపోవడంతో రోగులకు నష్టం 

బాధితుల్లో దెబ్బతింటున్న గుండె, మూత్రపిండాలు ∙ఐహెచ్‌ఎస్‌ అధ్యయనంలో వెల్లడి

అప్పటివరకూ లేని బీపీ డాక్టర్‌ దగ్గరకు వెళ్లి పరీక్ష చేయించుకున్నప్పుడు మాత్రమే వస్తోందా? ఇలా మీకు మాత్రమే కాదు.. దేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి ఇలాంటి చిత్రమైన అనుభవమే ఎదురవుతోంది.  
ఇంట్లో, ఆఫీసులో లేదా ఇతర ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఉన్న బీపీ.. డాక్టర్‌ దగ్గరకు వెళ్లేసరికి నార్మల్‌ అయిపోతోందా? దేశంలో 18 శాతం మందికి ఇలాగే అవుతోంది.   

ఇంతకీ ఏమిటిది? లేని బీపీ ఉన్నట్లు.. ఉన్న బీపీ లేనట్లు.. సైలెంట్‌ కిల్లర్‌గా మారుతున్న హైపర్‌టెన్షన్‌ తీరుతెన్నులపై ఇండియా హార్ట్‌ స్టడీ(ఐహెచ్‌ఎస్‌) ఇటీవల దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 9 నెలలపాటు అధ్యయనం నిర్వహించింది. ఇందులో 1,233 మంది వైద్యులు పాల్గొన్నారు. ఇండియా హార్ట్‌ స్టడీ ముఖ్య పరిశోధకుడు, బీహెచ్‌ఎంఆర్‌సీ చైర్మన్‌ అండ్‌ డీన్‌ అకడమిక్‌ రీసెర్చ్‌ డాక్టర్‌ ఉపేంద్రకౌల్, కార్డియోవాస్క్యులర్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ మాస్ట్రీచ్‌ డాక్టర్‌ విల్లెం వెర్బెక్, అపోలో ఆస్పత్రి కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ సునీల్‌కపూర్, ఉస్మానియా ఆస్పత్రి నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ మనీషాసహాయ్‌ల బృందం బుధవారం నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వివరాలను విడుదల చేసింది. ‘ఏపీ, తెలంగాణతోపాటు మొత్తం 15 రాష్ట్రాల్లో 23,253 మందికి స్క్రీనింగ్‌ నిర్వహించాం. వీరిలో 18,918 మంది రక్తపోటును రికార్డు చేశాం. వారంపాటు రోజుకు నాలుగుసార్లు ఇటు క్లినిక్‌తో పాటు అటు ఇంట్లోనూ టెస్ట్‌ చేయగా.. ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి’ అని వైద్యులు తెలిపారు.   

వైట్‌కోట్‌.. మాస్క్‌డ్‌: అప్పటివరకూ బీపీ లేని వ్యక్తి వైద్యుడి వద్దకు వచ్చినప్పుడు ఆ పరిసరాలు అవి చూసి ఆందోళనకు గురవడంతో పరీక్షలో బీపీ ఉన్నట్లు తేలుతోంది. దీన్ని వైట్‌కోట్‌ హైపర్‌టెన్షన్‌ అని అంటారు. దీని వల్ల బీపీ ఉన్నట్లుగా భావించి.. వైద్యుడు మందులు రాస్తున్నాడు.. బీపీ లేకున్నా మందులు వాడటం వల్ల రోగుల ఆరోగ్యం దెబ్బతింటోంది.. దేశవ్యాప్తంగా వైట్‌కోట్‌ హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నవారి శాతం 23గా ఉండగా.. తెలంగాణలో అది 35.9 శాతంగా ఉన్నట్లు ఈ అధ్యయనం పేర్కొంది. అలాగే ఉన్న బీపీ లేనట్లుగా కనిపించే మాస్‌్కడ్‌ హైపర్‌ టెన్షన్‌ రాష్ట్రంలో 14.3% మందిలో ఉన్నట్లు తేలింది.

సాధారణంగా హృదయ స్పందన రేటు నిమిషానికి 72 ఉండాలి.. అయితే.. భారతీయుల్లో అది 80గా ఉందని వైద్యులు తెలిపారు. ఉదయంతో పోలిస్తే.. సాయంత్రం బీపీ ఎక్కువగా ఉంటోందని చెప్పారు. 41% మందికి తమకు అధిక రక్తపోటు ఉన్న సంగతే తెలియదట.. సరైన వ్యాధి నిర్ధరణ జరగకపోవడం, నిర్లక్ష్యం వంటి వాటి వల్ల గుండెతోపాటు మూత్రపిండాలూ దెబ్బతింటున్నాయని వైద్యులు తెలిపారు. అందుకే బీపీ ఉన్నట్లు సరిగా నిర్ధా రణ కావాలంటే కనీసం వరుసగా నాలుగైదు రోజుల పాటు పరీక్షించుకుని నిర్ధారించుకోవడం ఉత్తమమని వైద్యులు ప్రకటిస్తున్నారు.  
 – సాక్షి, హైదరాబాద్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top