ఎవరి ఆశలకు గండి..? | Which Party Has Disadvantage With Less Voting Percentage | Sakshi
Sakshi News home page

ఎవరి ఆశలకు గండి..?

Apr 12 2019 12:31 PM | Updated on Apr 12 2019 12:32 PM

Which Party Has Disadvantage With Less Voting Percentage - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల లోక్‌సభ స్థానం పరిధిలో తక్కువగా నమోదైన పోలింగ్‌ శాతం ఎవరి విజయావకాశాలకు గండికొడుతుందోనన్న బెంగ రాజకీయ పార్టీల్లో మొదలైంది. గత లోక్‌సభ ఎన్నికలు, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే ఈసారి పోలింగ్‌ శాతం తగ్గింది. తాజా లోక్‌సభ ఎన్నికల్లో 53.84 శాతం పోలింగ్‌కాగా.. 2014లో జరిగిన ఎన్నికల్లో 60.51 శాతం మంది ఓటేశారు. అంటే పోలింగ్‌ 6.67 శాతం తగ్గింది. ఈ లోక్‌సభ పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా.. మూడు నియోజకవర్గాల్లో కనీసం 50 శాతం కూడా పోలింగ్‌ నమోదు కాకపోవడం ఆందోళన కలిగించే అంశం.

ముఖ్యంగా పట్టణ ప్రాంతాలైన శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌ నియోజకవర్గాల్లో చాలా మంది ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. కొందరు సెటిటర్లు వారి స్వస్థలాలకు వెళ్లడంతో పాటు ఐటీ, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు వరుస సెలవులు ఉండటంతో ఉద్యోగులు కుటుంబాలతో సహా పల్లెబాట పట్టారు. అలాగే ఎండల తీవ్రత కూడా పోలింగ్‌పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. బయటకు వచ్చేందుకు సాహసించలేదని తెలుస్తోంది. ఈ కారణాల వల్లే పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌ తగ్గిందన్నది అందరి విశ్లేషణ. మరోపక్క వరుస ఎన్ని కలు రావడంతో చాలా మంది సొంత గ్రామాలకు వెళ్లి ఓటు వేయడానికి ఆసక్తి చూపడం లేదు.

ఇటీవల కాలంలోనే అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ రెండు ఎన్నికల్లోనూ ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొన్నారు. ఆ తర్వాతి కొద్ది కాలానికే లోక్‌సభ ఎన్నికలు రావడంతో.. సొంత ఊళ్లకు వెళ్లేందుకు మొగ్గుచూపలేదని తెలుస్తోంది.ఎండల తీవ్రత, వ్యయ ప్రయాసాలను చూసి వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. పైగా స్థానిక, అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే.. అభ్యర్థుల ప్రచారం పెద్దగా లేదు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకున్న సందర్భాలు చాలా తక్కువ. వీటన్నింటి నేపథ్యంలోనే పోలింగ్‌ శాతం తగ్గిందని తెలుస్తోంది. మరోపక్క పూర్తిగా గ్రామీణ ప్రాంతాలైన చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. ఇక్కడ గణనీయంగా పోలింగ్‌ శాతం నమోదైంది. 

Advertisement
 
Advertisement
Advertisement