వ్యూహం ఏమిటో?

 what Is TRS Party Campaigning Plan - Sakshi

 టీఆర్‌ఎస్‌ అభ్యర్థులతో నేడు అధినేత కేసీఆర్‌ భేటీ

  అభ్యర్థుల బలాబలాలు, వ్యతిరేకతపై ప్రత్యేక దృష్టి

  ఎన్నికలపై దిశానిర్దేశం, ప్రచార వ్యూహాలపై చర్చ

  అధినేత ఏం చెబుతారోనని అభ్యర్థుల్లో ఉత్కంఠ

 కేసీఆర్‌ ప్రచార తేదీలు కూడా ఖరారయ్యే అవకాశం 

టీఆర్‌ఎస్‌ పార్టీ ఎన్నికల ప్రక్రియలో అన్ని విషయాల్లో ఒక అడుగు ముందుగానే ఉంటోంది.  ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించినట్లుగానే, నామినేషన్లు కూడా ముందుగానే వేసేందుకు అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకుంటు    న్నారు. టీఆర్‌ఎస్‌ భవన్‌లో జరిగే నేటి అభ్యర్థుల సమావేశంలోనే మెదక్‌ అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్‌ అభ్యర్థి మదన్‌ రెడ్డికి బీఫామ్‌లు ఇస్తారని తెలుస్తోంది.  నోటిఫికేషన్‌ వెలువడిన వెంటనే జిల్లాలో నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. అలాగే ఈ సమావేశంలో అభ్యర్థుల ప్రచారాలు, వ్యూహాలపై అభ్యర్థులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సమావేశం ఏలా సాగుతుందోనని అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.    

సాక్షి, మెదక్‌ : టీఆర్‌ఎస్‌ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎమ్మెల్యే అభ్యర్థులతో ఆదివారం టీఆర్‌ఎస్‌ భవన్‌లో భేటీ కానున్నారు. ఈ భేటీలో  కేసీఆర్‌ ఎమ్మెల్యే అభ్యర్థులతో ముఖాముఖిగా మాట్లాడటంతోపాటు ఎన్నికల ప్రచారం, వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల బలాబలాలు, ప్రచార తీరుతెన్నులపై ఇంటలిజెన్స్‌ నివేదికలను తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే పార్టీ వర్గాల ద్వారా వివరాలు తెప్పించుకున్నట్లు సమాచారం. దీంతో ఆదివారం టీఆర్‌ఎస్‌ అధినేత నిర్వహించబోయే సమావేశం ఎలా సాగుతోందనన్న ఉత్కంఠ ఎమ్మెల్యే అభ్యర్థుల్లో నెలకొంది.

ఎన్నికల నోటిఫికేషన్‌ కూడా సోమవారం విడుదల కానుంది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థులను ముందుగానే ప్రకటించిన కేసీఆర్‌ బీఫామ్‌ల అందజేతలో కూడా ముందుండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  దీని దృష్ట్యా నోటిఫికేషన్‌ వెలువడటానికి ఒకరోజు ముందుగానే ఆదివారం అభ్యర్థులతో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి మెదక్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మాదేవేందర్‌రెడ్డి, నర్సాపూర్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్‌రెడ్డి హాజరుకానున్నారు. ఈ సమావేశంలో ఈ ఇద్దరు అభ్యర్థులకు బీఫామ్‌లు అందజేయటంతోపాటు ఎన్నికల వ్యూహాంపై దిశానిర్ధేశం చేయనున్నట్లు సమాచారం. 

సలహాలు, సూచనలు..
ఉమ్మడి మెదక్‌ జిల్లా సీఎం కేసీఆర్‌ సొంత జిల్లా కావడంతో  జిల్లా ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ పోటీ చేస్తున్న గజ్వేల్‌ నియోకవర్గంలోని రెండు మండలాలు మెదక్‌ జిల్లాలో ఉన్నాయి. దీంతో జిల్లాలో చోటు చేసుకుంటున్న రాజకీయాలు పరిణామాలు, టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రచారం తీరుతెన్నులపై సీఎం కేసీఆర్‌ ఓ కన్నువేసి ఉంచినట్లు తెలుస్తోంది. మెదక్, నర్సాపూర్‌ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డిలు ఎన్నికల ప్రచారంపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. పార్టీ శ్రేణుల్లో అసంతృప్తులు, ప్రచారంలో ఎదురవుతున్న నిరసనలు, ఎమ్మెల్యే అభ్యర్థులు నిర్లక్ష్యం చేస్తున్న అంశాలపై కేసీఆర్‌ రహాస్య నివేదికలు తెప్పించుకున్నట్లు సమాచారం.ఆదివారం జరిగే సమావేశంలో కేసీఆర్‌ నివేదికలను అభ్యర్థుల ఎదుట ఉంచనున్నట్లు  తెలుస్తోంది. 

మెదక్, నర్సాపూర్‌ నియోజకవర్గాల్లో  అభ్యర్థుల   బలాలు, బలహీనతలు ఎత్తిచూపుతూనే, ఎన్నికల్లో గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్‌ సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు మెదక్, నర్సాపూర్‌ నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్‌ ప్రచార తేదీలపై చర్చించనున్నట్లు సమాచారం. సీఎం కేసీఆర్‌ మెదక్, నర్సాపూర్‌ నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగ సభల్లో పాల్గొనడంతోపాటు రోడ్‌షోలు నిర్వహించే అవకాశం కూడా ఉంది. సీఎం కేసీఆర్‌ ప్రచారానికి వస్తే  ఎన్నికల్లో పార్టీకి మరింత ఊపు వస్తుందని ఎమ్మెల్యే అభ్యర్థులు భావిస్తున్నారు. దీంతో సీఎం కేసీఆర్‌ ప్రచార సభలపై చర్చించి తేదీలపై  నిర్ణయం తీసుకోనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top