వెల్లుల్లితో వెయిట్‌లాస్‌!

Weight loss with garlic - Sakshi

వెల్లుల్లి.. భోజన ప్రియులకు సుపరిచితమైన పేరు.. వంటింట్లో ముఖ్యమైన దినుసుల్లో ఒకటైన వెల్లుల్లి రుచికే కాక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని తాజా పరిశోధనల్లో తేలింది. శరీరంలో అనవసరమైన కొవ్వును కరిగిస్తుందని, అధిక బరువును కూడా తగ్గిస్తుందని వెల్లడైంది. లాసన్‌ అని పిలిచే ఈ వెల్లుల్లిలో బి6, సీ విటమిన్, పీచు, మాంగనీస్, కాల్షియం సమృద్ధిగా ఉంటాయని, రోజూ క్రమం తప్పకుండా తగిన మోతాదులో తింటే శరీరంలో ఉండే కొవ్వు కరిగి నాజూకుగా తయారవుతారని పరిశోధకులు చెబుతున్నారు. ఈ అధ్యయన ఫలితాలు జర్నల్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ పత్రికలో ప్రచురితమయ్యాయి.

కొవ్వు కరుగుతుంది..
వెల్లుల్లిలో ఉండే అలిసిన్‌ అనే రసాయన సమ్మేళనాలు శరీరంలో ముఖ్యంగా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. ప్రతి రోజూ వెల్లుల్లిని తింటే బరువు కూడా తగ్గుతారని పరిశోధనలో తేలింది. వెల్లుల్లి శరీరంలో మూత్రం ఉత్పత్తిని పెం చుతుంది. తద్వారా అనవసరమైన కొవ్వు, విసర్జితాలు శరీరం నుంచి బయటకు పోతాయి. 

ఎలా వాడాలి.. 
ఉదయాన్నే నిద్ర లేవగానే కొన్ని పచ్చి వెల్లుల్లి పాయల్ని తిని నీళ్లు తాగాలి. లేదంటే వెల్లుల్లి రసాన్ని కూడా తాగవచ్చు. వెల్లుల్లి వాసన పడదనుకుంటే గోరు వెచ్చని నీటిలో కొంచెం నిమ్మరసాన్ని, వెల్లుల్లి రసాన్ని కలిపి తాగాలి. ఈ రసాన్ని తయారు చేసిన వెంటనే తాగేయాలి. నిల్వ ఉంచితే పనికిరాదు. వెల్లుల్లిని నిమ్మరసంతో కలిపి తీసుకుంటే తొందరగా బరువు తగ్గుతారని పరిశోధకులు చెబుతున్నారు. చాలామంది వెల్లుల్లి వాసన భరించలేక దానికి దూరంగా ఉంటారు. ఇలాంటి వారు వెల్లుల్లి పాయల్ని ఒకేసారి మాత్రల మాదిరిగా గబుక్కున మింగేయవచ్చు.  

ఎలా పని చేస్తుంది..  
వెల్లుల్లిలో ఆకలిని చంపేసే గుణముంది. దానివల్ల మీరు చాలా సేపు ఏమీ తినకపోయినా ఇబ్బంది రాదు. అతిగా తినడం కూడా తగ్గుతుంది. శరీరంలో ఉండే అదనపు క్యాలరీలను కరిగించడం ద్వారా వెల్లుల్లి మీకు శక్తిని ఇస్తుంది. రోగ నిరోధక వ్యవస్థ బలోపేతమవుతుంది. వెల్లుల్లిని నేరుగా తినడం వల్ల రక్తకణాలు ప్రభావితమవుతాయని, కొలెస్ట్రాల్‌ స్థాయి అదుపులో ఉంటుందని పరిశోధనలో తేలింది. వెల్లుల్లి శరీరంలో తయారయ్యే అన్ని రకాల విషాలను హరిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

మితమే హితం..  
ఆరోగ్యానికి మంచిది కదా అని అదే పనిగా వెల్లుల్లిని ఎక్కువగా తింటే ప్రమాదమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. మీ ఆరోగ్యం, శారీరక స్థితిని బట్టి తగినంత మాత్రమే వెల్లుల్లిని తీసుకోవాలి. ఎంత, ఎలా తీసుకోవాలన్నది డైటీషియన్‌ లేదా పోషకాహార నిపుణుడి ద్వారా తెలుసుకుంటే మంచిది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top