సెక్షన్-8 ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు | we will fight back again section 8, says srinivas gowd | Sakshi
Sakshi News home page

సెక్షన్-8 ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు

Jun 25 2015 1:44 AM | Updated on Aug 15 2018 9:27 PM

హైదరాబాద్‌లో ఏపీ విభజన చట్టంలోని సెక్షన్-8 అమలు చేస్తే మరో ఉద్యమం తప్పదని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం గౌరవ చైర్మన్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు.

టీజీవో ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంలో పౌర హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్
 హైదరాబాద్: విభజన చట్టంలోని సెక్షన్-8ని ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో అమలు చేయాలని కోరడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిదని పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో అలజడులు సృష్టించడానికే ఈ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ గెజిటెడ్ భవన్‌లో బుధవారం టీజీవో ఆధ్వర్యంలో సెక్షన్-8 అంశంపై టీజీవో సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హరగోపాల్ ముఖ్యఅతిథి హాజరై ప్రసంగించారు. హైదరాబాద్‌లో ఎలాంటి అలజడులులేని సమయంలో సెక్షన్-8 అమలేమిటని ప్రశ్నించారు. ఇలాంటి నిర్ణయాలను ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. సెక్షన్-8 అమలు జరిగితే శాంతియుతంగా ఉద్యమించాలని సూచించారు. శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గి కేంద్రం రాజ్యాంగ విరుద్ధంగా సెక్షన్-8ను ప్రయోగిస్తే దీటుగా ఎదుర్కొంటామన్నారు. అవసరమైతే ఢిల్లీని ముట్టడించి కేంద్రాన్ని నిలదీస్తామని, బీజేపీ నాయకులు దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు.
 
 టీఎన్జీవో సంఘం గౌరవ చైర్మన్ దేవీప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబు ‘ఓటుకు కోట్లు’ కేసు నుంచి తప్పించుకోవడానికి సెక్షన్-8ను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. టీఎన్జీవో కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్‌లో అన్ని రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల్లా కలసి ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ 4వ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్, టీజీవో అధ్యక్షురాలు మమత, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి ఎంఏ హమీద్, తెలంగాణ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ నేత అశ్వత్థామరెడ్డి, ఇంజనీర్స్ జేఏసీ నేత వెంకటేశం, పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగుల సంఘం నేత భూమన్న, ఇంటర్ జేఏసీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, గ్రూప్-1 అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ గౌడ్, హెచ్‌ఏఎల్ ఉద్యోగుల సంఘం నేత సి.రాందాస్, వీఆర్వోల సంఘం నేత గోల్కొండ సతీష్, టీఆర్‌టీయూ నేత సర్వోత్తమరెడ్డి, కేంద్ర ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్ ఉద్యోగుల సంఘం నేత దానకర్ణచారి, తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత పద్మాచారి, తెలంగాణ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి సంపత్‌కుమార్, తెలంగాణ నర్సుల అసోసియేషన్ నాయకురాలు సరళ, టీజీవోలు సలీముద్దీన్, డాక్టర్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement