ఇక చాలు!!

We Are Friends Now - Sakshi

సాక్షి, రామగుండం: తమ ఇద్దరి మధ్య కేశోరాం సిమెంట్‌ కర్మాగారం చిచ్చుపెట్టిందని, ఇద్దరి మధ్య వైరంతో ఇరవై ఏళ్లుగా రాజకీయంగా నష్టపోయామని, రాజకీయ గాడ్‌ ఫాదర్‌గా ఉన్న దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మృతితో తనకు రాజకీయంగా గడ్డుకాలం వచ్చిందని మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ వ్యాఖ్యానించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి రామగుండంలోని ఓ ప్రయివేటు ఫంక్షన్‌ హాల్‌లో కేశోరాం ఉద్యోగ, కార్మిక సంఘాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న కౌశిక హరి, మక్కాన్‌సింగ్‌ఠాకూర్‌లు ఒకే వేదికపైకి చేరారు. ఈ సందర్భంగా ముందుగా పట్టణ వాసులు మాట్లాడుతూ పలు సమస్యలను దృష్టికి తీసుకువచ్చారు. మరికొద్ది రోజుల్లో బీ–థర్మల్‌ మూతపడితే శ్మశానంతో సమానమవుతుందని ఏకరువు పెట్టారు.
 

కౌశికహరి మాట్లాడుతూ తమను రాజకీయంగా వాడుకుంటూ వారి గెలుపు తమతోనే సాధ్యం చేసుకున్నారని, తామిద్దరం కలిసి ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీస్తామనే భయంతో తమ మధ్య వైరం ఉండాలనే ఉద్దేశంతో అందరూ రాజకీయ లబ్ధి పొందారన్నారు. మక్కాన్‌సింగ్‌ మాట్లాడుతూ స్థానికుల నుంచి వస్తున్న ఇంతటి ఆప్యాయతను చూస్తుంటే తనకు మాట రావడం లేదంటూ ఒక్కసారిగా ఉద్వేగానికి  లోనై కన్నీళ్లు కార్చారు. ఇప్పటికే రాజకీయంగా ఇరవై ఏళ్లు నష్టపోయాం. అవకాశం వచ్చంది తన తోబుట్టువులు తనకు సహకరించాలని కోరుతున్నాననడంతో ఒక్కసారిగా చప్పట్లతో హాల్‌ దద్దరిల్లిపోయింది. త్వరలోనే పెద్ద ఎత్తున అభిమానులతో బహిరంగ సభలను ఏర్పాటు చేసి మేమిద్దరం ఇంటింటికీ తిరిగి ఓట్లను అభ్యర్థిస్తామన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top