పోరు షురు.. | Warangal Municipal Corporation | Sakshi
Sakshi News home page

పోరు షురు..

Feb 22 2016 1:35 AM | Updated on Mar 29 2019 9:31 PM

పోరు షురు.. - Sakshi

పోరు షురు..

మరో ఎన్నికల పోరుకు తెరలేచింది. వరంగల్ మహా నగరపాలక సంస్థ(జీడబ్ల్యూఎంసీ) పాలక మండలి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.

పార్టీలకు ప్రతిష్టాత్మకంగా ‘గ్రేటర్’ ఎన్నికలు
టీఆర్‌ఎస్‌లో టికెట్ల కోసం తీవ్ర పోటీ
ఒక్కో డివిజన్ నుంచి సగటున పది మంది..
అసంతృప్తులను బుజ్జగించడమే పెద్ద పని
కాంగ్రెస్‌లోనూ ఆశావహుల ప్రయత్నాలు
బీజేపీ, టీడీపీ పరిస్థితి దయనీయం

 
వరంగల్ : మరో ఎన్నికల పోరుకు తెరలేచింది. వరంగల్ మహా నగరపాలక సంస్థ(జీడబ్ల్యూఎంసీ) పాలక మండలి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. గతానికి భిన్నంగా రెండు వారాల్లోనే ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుండడంతో రాజకీయ పార్టీల్లో వేడి పెరిగింది. డివిజన్ల వారీగా ఆశావహుల బలాబలాలపై రాజకీ య పార్టీలు అంచనా వేసుకుంటున్నాయి. కార్పొరేటర్ల టికెట్ల కోసం టీఆర్‌ఎస్‌లో తీవ్ర పోటీ నెల కొంది. ఒక్కో డివిజన్ నుంచి సగటున పది మంది ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం స్థానిక ఎమ్మెల్యేలకు విన్నవించుకుంటూనే... పార్టీ రాష్ట్ర నాయకత్వంలోని ముఖ్య నేతలతోనూ ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకత్వం మాత్రం డివిజన్ల వారీగా అశావహుల బలాబలాలను తెలుసుకునేందుకు వివిధ మార్గాల్లో సమాచారం సేకరిస్తోంది. ప్రైవేటు సంస్థల సర్వేలు, ఇంటెలిజెన్స్ పోలీస్ విభాగం నుంచి నివేదికలు తెప్పించుకుంటోంది. ప్రతి డివిజన్‌లో గెలిచే అభ్యర్థినే నిలబెట్టాలనే వ్యూహంలో అధికార టీఆర్‌ఎస్ ఉంది. టికెట్లు కేటాయించేందుకు ముందే డివిజన్ల వారీగా ఆశావహులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ ఆదివారం డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహించారు. ఇది మరో రెండు రోజులు కొనసాగే అవకాశం ఉంది. వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, పరకాల, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల్లోనూ డివిజన్ల వారీగా సమన్వయ సమావేశాలు జరగనున్నాయి. టీఆర్‌ఎస్‌లోకి కొత్తగా వస్తున్న నేతలతో టికెట్ల ఎంపిక విషయం పార్టీకి ఇబ్బందులను పెంచుతోంది.

వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో డిపాజిట్ సైతం దక్కించుకోలేకపోయిన  కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో పరువు నిలుపుకునే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్‌కు చెందిన పలువురు నగర నేతలు, మాజీ కార్పొరేటర్లు వరుసగా పార్టీని వీడుతున్నారు. వీరి స్థానంలో ఆయా డివిజన్లకు వెంటనే కొత్త నేతలను ఎంపిక చేసుకోవడం అధిష్టానానికి ఇబ్బందికరంగా మారుతోంది. గ్రేటర్ వరంగల్‌లో తమకు సంప్రదాయ ఓటు బ్యాంకు ఉందనే ధీమాతో ఆ పార్టీకి చెందిన పలువురు ద్వితీయ శ్రేణి నేతలు కార్పొరేటర్లుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 58 డివిజన్లలో పోటీ చేసేందుకు ఇప్పటి వరకు 302 దరఖాస్తులు వచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అన్ని డివిజన్లలో పోటీ చేయడం... వీలైనంత వరకు ఎక్కువ స్థానాల్లో గెలుపు సాధించడం లక్ష్యంగా ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచార బాధ్యతల ఇన్‌చార్జిగా పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క వ్యవహరిస్తున్నారు. గ్రేటర్ ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయడం లక్ష్యంగా ఆ పార్టీ సోమవారం సాయంత్రం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తోంది. ఇక బీజేపీ, టీడీపీల పొత్తుకు తెరపడుతున్న నేపథ్యంలో రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అన్ని డివిజన్లలో అభ్యర్థులను నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నా.. బరిలో దిగేవారు దొరికే పరిస్థితి కనిపించడం లేదు.

ఈ రెండు పార్టీలకు చెందిన పలువురు ముఖ్య నేతలు త్వరలోనే అధికార పార్టీలో చేరే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. వరంగల్ మేయర్ పదవిని జనరల్ కేటగిరికి రిజర్వ్ చేశారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 58 డివిజన్లలో 13 స్థానాలు అన్ రిజర్వ్‌డ్ కేటగిరిలో ఉన్నాయి. ఈ డివిజన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరీలకు చెందిన మహిళలు, పరుషులు పోటీ చేసే అవకాశం ఉంటుంది. జనరల్ మహిళలకు 15 డివిజన్లు రిజర్వ్ చేశారు. ఈ డివిజన్లలో ఎస్టీ, ఎస్టీ, బీసీ, జనరల్ మహిళలు పోటీ చేసే అవకాశం ఉంటుంది. బీసీలకు 19 డివిజన్లు రిజర్వు చేశారు. ఇందులో బీసీ జనరల్‌కు 10 డివిజన్లు, బీసీ మహిళలకు 9 డివిజన్లు కేటారుుంచారు. ఎస్సీలకు 9 డివిజన్లు రిజర్వ్ చేయగా, ఎస్సీ జనరల్ కేటగిరిలో ఐదు, ఎస్సీ మహిళల కేటగిరిలో నాలుగు డివిజన్లు ఉన్నాయి. ఎస్టీలకు రెండు డివిజన్లు కేటాయించగా ఒకటి ఎస్టీ జనరల్, మరొకటి ఎస్టీ మహిళలకు రిజర్వు చేశారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement