నమోదు.. నారాజ్‌

Voting Registration In Websites And Near Voting Centres Hyderabad - Sakshi

ఓటరు నమోదు, సవరణల కేంద్రాల్లో కనిపించని సిబ్బంది

కొన్ని చోట్ల తెరుచుకోని సెంటర్లు  

కాగితాల్లోనే ఎన్నికల కార్యాచరణ

జిల్లా ఎన్నికల అధికారిఆకస్మిక తనిఖీ..  

ముఫకంజా కాలేజీలోకనిపించని బీఎల్‌ఓపై వేటు

సాక్షి, సిటీబ్యూరో/బంజారాహిల్స్‌: వచ్చే ఏడాది జరుగుతాయనుకున్న అసెంబ్లీ ఎన్నికలు ముందే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి దాకా ఓటరు జాబితాలో పేర్లు లేని వారు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వారికోసం ఓటరు జాబితా సవరణల షెడ్యూల్‌ అవకాశం కల్పించింది. ఈ నెల 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకు పేర్లు నమోదు చేయించుకోవచ్చునని ఎన్నికల కమిషన్‌ ప్రకటించి తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించింది. అందుకు అనుగుణంగా గ్రేటర్‌లోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో అవసరమైన ఫారాలతో పాటు ఎన్నికల సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించింది. కానీ, నగరంలోని పలు ప్రాంతాల్లో ఓటరు నమోదు సిబ్బంది అందుబాటులో ఉండడం లేదు.

కొన్ని ప్రాంతాల్లో ఇంకా కేంద్రాలే తెరచుకోలేదు. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసుకుందామని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీకి వెళ్లిన హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం. దానకిశోర్‌.. బంజారాహిల్స్‌లోని ముఫకంజా కాలేజీ సెంటర్‌లోని పరిస్థితి చూసి షాక్‌ తిన్నారు. ఇక్కడి పోలింగ్‌ కేంద్రంలో బూత్‌ లెవెల్‌ అధికారి(బీఎల్‌ఓ) లేకపోవడంతో అవాక్కయ్యారు. అక్కడ నియమించిన శానిటరీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ (ఎస్‌ఎఫ్‌ఏ) నగేశ్‌ గైర్హాజరు కావడంతో వెంటనే అతన్ని విధుల నుంచి తొలగించి ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 32వ సెక్షన్‌ కింద కేసు నమోదు చేయాలని సంబంధిత ఓటరు నమోదుఅధికారికి ఆదేశాలు జారీ చేశారు. ఇదే నియోజకవర్గంలోని బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.10 నూర్‌నగర్‌లోని నిజామియా హైస్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల వరకు సిబ్బంది ఎవరూ రాకపోగా.. కనీసం గేట్లు కూడా తెరవలేదు.

కేంద్రాల్లో వెక్కిరిస్తున్న సమస్యలు
కొత్తగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలనుకున్న వారికి, చిరునామా మార్పులు వంటి సవరించుకోవాలనుకున్న వారికి ఎదురవుతున్న ఇబ్బందులకు ఇవి మచ్చుతునకలు. ఈ నెల 10 నుంచే పోలింగ్‌ కేంద్రాల్లో బీఎల్‌ఓలు ముసాయిదా ఓటర్ల జాబితాతో సిద్ధంగా ఉంటారని, అభ్యంతరాల స్వీకరణ, ఓటరు నమోదు చేపట్టి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరిస్తారని జీహెచ్‌ఎంసీ దానకిశోర్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్‌కుమార్‌ సైతం ప్రకటించారు. కానీ నగరంలోని పలు పోలింగ్‌ కేంద్రాల్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు 3,826 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు కావాల్సి ఉండగా చాలా ప్రాంతాల్లో ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. నామమాత్రంగా తెరచిన చోట్ల సిబ్బంది లేరు. మరికొన్ని ప్రాంతాల్లో సామగ్రి లేదు. యాకూత్‌పురా నియోజకవర్గంలోని కుర్మగూడ హైస్కూల్‌ పోలింగ్‌ కేంద్రానికి సిబ్బంది ఉన్నా, అవసరమైన సామగ్రి ఇవ్వకపోవడంతో ఇబ్బందులెదురవుతదున్నాయని స్థానికులు పేర్కొన్నారు.

దానకిశోర్‌ ఆకస్మిక తనిఖీ
హైదరాబాద్‌ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదుకు నియమించిన బీఎల్‌ఓలు విధుల్లో నిర్లక్ష్యం కనబరిస్తే ప్రజాప్రాతినిధ్యం చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిషోర్‌ హెచ్చరించారు. ముఫకంజా కాలేజీ తనిఖీ సందర్భంగా అక్కడ పలు సమస్యలను ఆయన గుర్తించారు. నూతన ఓటరు నమోదుకు ఫారం–6తో పాటు ఓటర్ల బదిలీ, మరణించిన వారి ఓట్లను తొలగించేందుకు అవసరమైన దరఖాస్తులను సిద్ధంగా ఉంచుకోవాలని సిబ్బందికి సూచించారు. అనంతరం బంజారాహిల్స్‌ రోడ్‌ నెం–13లోని పోలింగ్‌ కేంద్రంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను తనిఖీ చేశారు. తమకు కేటాయించిన ప్రాంతాల్లో విధి నిర్వహణపై నిర్లక్ష్యం వహించడం, గైర్హాజరయ్యే బీఎల్‌ఓలకు జైలు శిక్షతో పాటు నగదు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఎన్నికల విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే సిబ్బందిపై చర్యలు తీసుకుంటే కోర్టులు కూడా జోక్యం చేసుకోవన్నారు. 

మీ ఓటును సరిచూసుకోండి
ఓటరు జాబితాలో తమ పేరు, కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయో, లేవో తెలుసుకోవడానికి  www.ceotelangana.nic.in లో గాని, సమీపంలోని పోలింగ్‌ బూత్‌లోగాని చూసుకోవాలి. పేరు లేకుంటే అదే వెబ్సైట్లో లేదా సంబంధిత బీఎల్‌ఓ వద్ద ఓటర్గా నమోదు చేసుకోవాలి. ఇందుకు నిర్దేశిత ఫారంతో పాటు 4 ఫొటోలు, చిరునామా రుజువు పత్రం (గ్యాస్‌ బిల్లు, వాటర్‌ బిల్లు,  డ్రైవింగ్‌ లైసెన్స్, కరెంట్‌ బిల్లు వంటివి) వయసు రుజువు పత్రం(డ్రైవింగ్‌ లైసెన్స్‌/ఆధార్‌/పదో తరగతి మార్కుల మెమో)సమర్పించాలి. ఓటర్లు ఈనెల 25 లోగా పేరు నమోదు చేసుకోవాలి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top