భవితవ్యం తేలేది ఇక్కడే

Voting Counter Centers In Nizamabad - Sakshi

ఉమ్మడి జిల్లాలో రెండు కౌంటింగ్‌ కేంద్రాలు

నిజామాబాద్‌లో పాలిటెక్నిక్‌ కళాశాల

కామారెడ్డిలో మార్కెటింగ్‌ గోదాం వద్ద ఓట్ల లెక్కింపు

 బాన్సువాడ కౌంటింగ్‌ నిజామాబాద్‌లోనే.. 

సాక్షి, కామారెడ్డి (నిజామాబాద్‌): అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది. ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు వేగంగా పూర్తి చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం ఈవీఎంలు, వీవీప్యాట్‌ల భద్రత నుంచి ఎన్నికల నోడల్‌ అధికారుల నియామకం, ఆపై ఎన్నికల సిబ్బంది నియామకం వరకు పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ నెల 12న ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన తరువాత పనులు మరింత వేగంగా జరుగనున్నాయి.

ఇప్పటికే ఎన్నికలకు కావాల్సిన ఈవీఎంలు, వీవీప్యాట్‌లను కామారెడ్డి పట్టణ శివార్లలో కొత్తగా నిర్మిస్తున్న కలెక్టరేట్‌ సమీపంలో ఉన్న మార్కెటింగ్‌ శాఖ గోదాంలో భద్రపరిచారు. అక్కడ పటిష్టమైన పోలీసు భద్రతను కూడా ఏర్పాటు చేశారు. అయితే కామారెడ్డి జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్‌ సత్యనారాయణ పర్యవేక్షణలో ఎన్నికలు జరుగుతున్నాయి. జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉండగా, బాన్సువాడ నియోజకవర్గ ఎన్నికలు నిజామాబాద్‌ జిల్లా అధికారుల పర్యవేక్షణలో జరుగుతున్నాయి.

కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ నియోజక వర్గాల ఎన్నికలు కామారెడ్డి ఎన్నికల అధికారి పర్యవేక్షణలో జరుగుతున్నాయి. కామారెడ్డి నియోజక వర్గానికి సంబంధించి ఎన్నికల అధికారిగా స్థానిక ఆర్డీవో రాజేంద్రకుమార్‌ వ్యవహరిస్తున్నారు. నియోజక వర్గంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌గా స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఎంపిక చేశారు. ఎన్నికలకు వెళ్లే సిబ్బందికి సామాగ్రినంతా ఇక్కడి నుంచే అందజేస్తారు. తరువాత రిసీవింగ్‌ కూడా ఇక్కడే ఉంటుంది.

ఎల్లారెడ్డి నియోజక వర్గానకి సంబంధించి డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రంగా అక్కడి జీవదాన్‌ హైస్కూల్‌ను ఎంపిక చేశారు. అక్కడి నుంచే సిబ్బందికి సామాగ్రిని అందజేస్తారు. అలాగే తిరిగి అక్కడే రిసీవ్‌ చేసుకుంటారు. స్థానిక ఆర్డీవో దేవేందర్‌రెడ్డి ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు. జుక్కల్‌ నియోజక వర్గానికి సంబంధించి మద్నూర్‌లోని బాలుర ఉన్న పాఠశాలలో డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. బాన్సువాడ ఆర్డీవో రాజేశ్వర్‌ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు.

కామారెడ్డిలో మూడుస్థానాల కౌంటింగ్‌
కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌ నియోజక వర్గాల ఎన్నికల కౌంటింగ్‌ కామారెడ్డి పట్టణంలోని మార్కెటింగ్‌ శాఖ గోదాంలో నిర్వహించనున్నారు. కొత్తగా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు నిర్మిస్తున్న చోట ఉన్న ఈ గోదాంను ప్రస్తుతం వీవీప్యాట్‌లు, ఈవీఎంలను భద్రపరచడానికి వాడుతున్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే ఈవీఎంలు, వీవీప్యాట్‌లను కౌంటింగ్‌ కేంద్రానికి తీసుకువచ్చి ఇక్కడి స్ట్రాంగ్‌రూంలో భద్రపరుస్తారు. డిసెంబర్‌ 7న ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షలలో స్ట్రాంగ్‌రూంను తెరిచి కౌంటింగ్‌ ప్రక్రియను మొదలుపెడతారు. ఒక్క బాన్సువాడ నియోజక వర్గానికి సంబంధించి కౌంటింగ్‌ మాత్రం నిజామాబాద్‌లో జరుగనుంది. 

ఇందూరులో నాలుగు స్థానాలకు..

సాక్షి,నిజామాబాద్‌అర్బన్‌: నిజామాబాద్‌ జిల్లాలో కౌంటింగ్‌ కేంద్రంగా గత కొన్ని సంవత్సరాలుగా పాలిటెక్నిక్‌ కళాశాల కొనసాగుతోంది. జిల్లాలో జరిగిన సాధారణ ఉప ఎన్నికలకు సంబంధించి రెండు సార్లు మినహా మిగతా అన్ని సంవత్సరాల సాధారణ, ఉప ఎన్నికల ఫలితాలకు కంఠేశ్వర్‌లోని పాలిటెక్నిక్‌ కళాశాలనే కేంద్ర బిందువు. సాధారణ ఎన్నికలు వచ్చాయంటే పాలిటెక్నిక్‌ కళాశాల భద్రత వలయంలోకి వెళుతుంది. గతంలో పాలిటెక్నిక్‌ కళాశాలలో పాత జిల్లాలోని 9 నియోజక వర్గాల ఫలితాలను వెలువరించేవారు. ఎన్నికల నిర్వహణ ముగియగానే బ్యాలెట్‌బాక్సులు, ఈవీఎంలను పాలిటెక్నిక్‌ కళాశాలలో భద్రతపరుస్తారు. గతంలో ఫలితాలు వెల్లడిం చేందుకు దాదాపు నెలరోజుల సమయం పట్టేది. అంత వరకు పాలిటెక్నిక్‌ కళాశాలలోని గోదాముల్లో వీటిని భద్రపరిచేవారు.

ప్రస్తుతం కామారెడ్డి జిల్లా ఏర్పాటు కావడంతో నిజామాబాద్‌లోని ఐదు నియోజకవర్గాలు, బాన్సువాడ నియోజకవర్గ ఫలితాలు సైతం ఇక్కడే వెలువరించనున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని కొన్ని మండలాలు నిజామాబాద్‌లో, మరికొన్ని కామారెడ్డిలో ఉండగా ఎన్నికల బాధ్యతను నిజామాబాద్‌ కలెక్టర్‌కే అప్పగించారు. దీంతో ఆ నియోజకవర్గ ఫలితాలు కూడా ఇక్కడే వెలువడనున్నాయి. ఫలితాల విడుదల చేసే రోజు కళాశాల ఉన్న కంఠేశ్వర్‌ ప్రాంతం సందడిగా మారుతుంది. గెలుపొందిన అభ్యర్థులు సంబరాలు చేసుకోవడంతో ఈ ప్రాంతమంతా బిజీబిజీగా ఉంటుంది. 

రెండుసార్లు మినహా.. 
2014 సాధారణ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్‌ డిచ్‌పల్లిలోని మెడికల్‌ కళాశాలలో నిర్వహించారు. అలాగే, 1999 సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికలు బాన్సువాడ, జుక్కల్‌ నియోజక వర్గాలకు సంబంధించి కౌంటింగ్‌ కేంద్రాన్ని సుభాష్‌నగర్‌లోని నిర్మల హృదయపాఠశాలలో ఏర్పాటుచేశారు. మిగతా ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రాలు కంఠేశ్వర్‌లోని పాలిటెక్నిక్‌ కళాశాలలో కొనసాగింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top