ప్రజలు అప్రమత్తంగా ఉండాలి | Villages Peoples Allart Sp Sunpreet Singh | Sakshi
Sakshi News home page

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

May 2 2018 10:46 AM | Updated on Aug 21 2018 6:02 PM

Villages Peoples Allart Sp Sunpreet Singh - Sakshi

మాట్లాడుతున్న ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌

వంగూరు : దొంగతనాలపై ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్‌ పేర్కొన్నారు. వంగూరు మండలం జాజాలలో శనివారం దొంగతనం జరగడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. వరుసగా జరుగుతున్న దొంగతనాలను నివారించేందుకు సోమవారం ఎస్పీ జిల్లా పోలీసు అధికారులతో కలిసి వంగూరు పోలీసులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వేసవికాలంలో దొంగతనాలు అధికంగా జరుగుతాయని చెప్పారు. చాలామంది ఇంట్లో బంగారు, నగదు ఉంచి పెళ్లిళ్లకు, విహార యాత్రలకు వెళ్లడం, ఇంటి మిద్దెలపై పడుకోవడం ఎక్కువ చేస్తుంటారని తెలిపారు.

వీటిని ఆసరాగా తీసుకుని దొంగతనాలకు పాల్పడుతారని పేర్కొన్నారు. పోలీసులు ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు సభలు, సమావేశాలు నిర్వహించడంతో పాటు ప్రతి గ్రామంలో దండోరా వేయిస్తామని సూచించారు. ముఖ్యంగా ఆయా గ్రామాలకు చెందిన యువత గస్తీ తిరిగితే బాగుంటుందని అన్నారు. ఇందు కోసం ముందుకు వచ్చే యువకులకు పోలీసు ఐడెంటీకార్డులు సైతం అందజేస్తామన్నారు. ప్రస్తుతం జిల్లాలో స్థానికేతరులే దొంగతనాలకు పాల్పడుతున్నట్లు సమాచారం ఉందని, త్వరలోనే అందరినీ గుర్తించి, పట్టుకుంటామని తెలిపారు. సమావేశంలో ఏఎస్పీ చెన్నయ్య, డీఎస్పీ ఎల్‌సీనాయక్, వెల్దండ సీఐ గిరికుమార్, వంగూరు, వెల్దండ, చారకొండ ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement