తటస్థ ఓటర్లు ఎటువైపు!

Vikarabad Election Campaign Information - Sakshi

సాక్షి, వికారాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఇప్పటికే జిల్లాలోని తాండూరు, పరిగి, వికారాబాద్‌లో కేటీఆర్‌తో ప్రచారం చేయించింది. తెలంగాణలోని 16 ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఆ పార్టీ ముందుకు సాగుతోంది. చేవెళ్లలో కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కంకణం కట్టుకున్నారు. ఔర్‌ ఏక్‌ బార్‌ మోదీ అన్న నినాదంతో బీజేపీ అభ్యర్థి జనార్దన్‌రెడ్డి చేవెళ్ల సీటును కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. త్రిముఖ పోటీలో గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయని టీఆర్‌ఎస్‌ అంచనా వేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక పవనాలు తమకు అనుకూలిస్తాయని కాంగ్రెస్‌ భావిస్తోంది.

మోదీ చరిష్మా తమకు విజయం కట్టబెడుతుందని కమలనాథులు అంచనా వేస్తున్నారు. మూడు పార్టీలు తమ వ్యక్తిగత సర్వేల ద్వారా పార్టీ బలాబలాలను ఆంచనా వేస్తూ ఓటింగ్‌పై లెక్కలు వేసుకుంటున్నాయి. అయితే, ఈనెల 11న జరిగే లోక్‌సభ ఎన్నికల్లో తటస్థ ఓటర్లు తీర్పు కీలకం కానున్నారు. పార్టీల మేనిఫెస్టో, అభ్యర్థుల పనితీరు, హామీలు తదితర అంశాలను ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూ ఓటింగ్‌ రోజునే తమ ఓటును ఏ పార్టీకి వేయాలనే విషయమై తటస్థ ఓటర్లు నిర్ణయం తీసుకుంటారు. నేతలు జిల్లాలోని పట్టభద్రులు, ఉద్యోగస్తులపై ప్రత్యేక నజర్‌ పెట్టారు. అధికార టీఆర్‌ఎస్‌ సహా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పట్టభద్రులు, ఉద్యోగస్తుల మద్దతు కూడగట్టేందుకు తెరవెనుక పావులు కదుపుతున్నాయి.

    
వారి నాడి ఎటువైపో..  
జిల్లాలో మొత్తం 8,93,147 మంది ఓటర్లు ఉన్నారు. చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలోకి వచ్చే వికారాబాద్, తాండూరు, పరిగి అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 6,77,330 మంది ఓటర్లు ఉన్నారు. ఆయా రాజకీయ పార్టీలకు సొంతంగా ఓటు బ్యాంకు ఉంది. అయితే, అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్‌సభ ఎలక్షన్‌ భిన్నంగా సాగుతున్నాయి. బహిరంగసభలు, రోడ్‌షోల ద్వారా ఓటర్లను మచ్చిక చేసుకునే యత్నం చేస్తున్నారు. గెలుపులో తటస్థ ఓటర్ల తీర్పు కీలకం కానుంది. చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలోకి వచ్చే జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 6,77,330 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 30  శాతం మేర తటస్థ ఓటర్లు ఉంటారని అంచనా వేస్తున్నారు. తటస్థ ఓటర్లతోపాటు జిల్లా 25 వేల మందికిపైగా ఉద్యోగులు, 75 వేలకుపైగా పట్టభద్రులు ఉన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తటస్థ ఓటర్లు, ఉద్యోగులు, పట్టభద్రుల తీర్పు కీలకం కానుంది. తమ గెలుపులో కీలకం కానున్న వీరిని తమవైపు తిప్పుకునేందుకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే, తటస్థ ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపుతారో వేచి చూడాల్సిందే. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top