ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూత

Veteran Director Kodi Ramakrishna Passes Away - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్ను మూశారు. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన.. శుక్రవారం మధ్యాహ్నం తనువు చాలించారు. గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులో కోడి రామకృష్ణ జన్మించారు. దాసరి నారాయణ రావు శిష్యుడిగా మొదలైన అయన ప్రస్థానం.. తెలుగు తెరపై ఓ ముద్ర వేసింది. ఆయన మృతితో టాలీవుడ్‌ శోక సంద్రంలో మునిగింది.  పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఫాంటసీ చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన శైలి భిన్నమని అమ్మోరు, దేవి, అరుంధతి లాంటి సినిమాలను చూస్తే తెలుస్తుంది. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యతో టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమైన ఆయన వంద చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు. 2016లో కన్నడ చిత్రమైన ‘నాగహారవు’ ఆయన దర్శకత్వం వహించిన చివరి సినిమా. 

చిరంజీవికి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, బాలకృష్ణకు మంగమ్మ గారి మనవడు లాంటి బ్లాక్‌​బస్టర్‌ హిట్‌లు అందించిన కోడి రామకృష్ణను పది నంది అవార్డులు, రెండు ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు వరించాయి.  ఆయన 2012లో రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారాన్ని అందుకున్నారు. సుమన్‌, అర్జున్‌, భానుచందర్‌లాంటి హీరోలను తెరకు పరిచయం చేశారు. మధ్య తరగతి కుటుంబాల నేపథ్యాన్ని ఆధారంగా ఆయన అనేక చిత్రాలను తెరకెక్కించారు. ఆయన దర్శకుడిగానే కాకుండా.. నటుడిగాను మెప్పించారు. ఆయన దర్శకత్వంలో చివరగా వచ్చిన సూపర్‌హిట్‌ చిత్రం అరుంధతి. అద్భుత గ్రాఫిక్స్‌ మాయాజాలంతో తెరకెక్కిన ఈ మూవీ రికార్డులు సృష్టించింది.

కోడి రామకృష్ణ అపూర్వ చిత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top