కన్నీరు పెట్టిన మంత్రి

Vemula Prashant Reddy Cries After Watching TRS Leader Kareem Children - Sakshi

కలీం కుటుంబాన్ని ఆదుకుంటాం; మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి

ప్రభుత్వపరంగా సహాయమందిస్తామని హామీ

మృతుడి పిల్లలను చూసి విలపించిన మంత్రి

రూ. లక్ష నగదు ఆర్థిక సాయం

టీఆర్‌ఎస్‌ నేత కలీం హత్య కేసులో నిందితులకు శిక్ష పడేలా చూస్తామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి బుధవారం హామీ ఇచ్చారు. భీమ్‌గల్‌లో కలీం కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. 

సాక్షి, నిజామాబాద్‌: మండంలలోని బాబాపూర్‌లో రెండు రోజుల క్రితం హత్యకు గురైన ఖలీం కుటుంబాన్ని అన్ని విధాలా అదుకుంటామని, వారికి అండగా ఉంటామని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం ఆయన భీమ్‌గల్‌ పట్టణంలోని కర్నె గల్లీలో కలీం ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఖలీం భార్య, కూతురు, కుమారుడితో పాటు, నెలల బాలుడిని చూపి దుఖం ఆపుకోలేక విలపించారు. వారిని ఓదార్చరు. నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చూస్తానని కుటుంబ సభ్యులకు మాటిచ్చారు. వారు ఎంతటివారైనా వదిలేదిలేదన్నారు. తాను వివరాలు కనుక్కున్నానని, అధికారులు వేగంగా విచారిస్తున్నారన్నారు. ఖలీం కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అందాల్సిన అన్ని ప్రయోజనాలు అందించేందుకు తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానన్నారు. తక్షణ సాయం కింద రూ.లక్ష నగదును అందజేశారు.

ఖలీం హత్యకు కారణమైన భూవివాదం విషయంలో న్యాయ పరంగా, రెవెన్యూ పరంగా సహాయం చేస్తానన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి హింసాత్మక ఘటనలకు తావులేదన్నారు. స్వతహాగా ప్రొఫెషనల్‌ చిత్రకారుడైన ఖలీం గీస్తున్న, సగం పూర్తయిన మంత్రి వేముల చిత్రపటాన్ని మృతుడి సోదరులు మంత్రికి చూపించారు. ఖలీం తన కుటుంబానికి లేకపోయినా కాలనీవాసుల మంచి చెడ్డలు చూసేవాడన్నారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేకున్నా అప్పుచేసి మరీ వేసవిలో కాలనీవాసులకు ట్యాంకర్‌ ద్వారా నీరు అందించాడన్నారు. నిరంతరం ప్రజల కోసం తపించే ఖలీం మృతితో అతడి కుటుంబం వీధిన పడే పరిస్థితి నెలకొందన్నారు. తామె విరాళాలు వేసి అందజేసామని కాలనీవాసులు పేర్కొన్నారు. తాను అన్ని విధాలు ఆదుకుంటామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. మంత్రి వెంట ఆర్డీవో శ్రీనివాసులు, ఏసీపీ వెగ్గలం రఘు, సీఐ సైదయ్య, జెడ్పీటీసీ చౌట్‌పల్లి రవి, టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ దొనకంటి నర్సయ్య ఉన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top