ఈవీఎం వద్దు.. బ్యాలెట్‌ ముద్దు 

Uttam Kumar Reddy Demands For Ballet Elections - Sakshi

ఇందిరాపార్కు వద్ద ధర్నాలోమహాకూటమి నేతల డిమాండ్‌ 

ఓట్ల గల్లంతులో తప్పు చేసినవారిపై చర్యలు తీసుకోవాలి 

హైదరాబాద్‌: ఈవీఎంల పనితీరుపై ప్రజలు, రాజకీయపార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నందున బ్యాలెట్‌ పేపర్‌ విధా నం తీసుకురావాలని మహాకూటమి నేతలు డిమాండ్‌ చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఈవీఎంలను పక్కన పెట్టి బ్యాలెట్‌ ద్వారా ఎన్నికలు జరుపుతున్నారని గుర్తు చేశారు. ఈవీఎంలపై హైదరాబాద్‌లో జరిగిన ఆందోళన దేశవ్యాప్త ఉద్యమానికి నాంది అని పేర్కొన్నారు. ఓటరు జాబితా అవకతవకలపై ఎన్నికల కమిషనర్‌ క్షమాపణ చెప్పినంత మాత్రాన సరిపోదని, తప్పు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం వైఫల్యాలను నిరసిస్తూ టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ అధ్యక్షుడు మర్రి శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద గురువారం ధర్నా జరిగింది. 

ఎన్నికల నిర్వహణలో ఈసీ విఫలం
ఇందిరాపార్క్‌ వద్ద జరిగిన ధర్నానుద్దేశించి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ మార్జిన్‌ ఒక శాతం కంటే తక్కువ ఉంటే రీకౌంటింగ్‌ చేయాల్సి ఉండగా వీవీ ప్యాట్‌ల రీకౌంటింగ్‌కు ఈసీ ఒప్పుకోకపోవడం శోచనీయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంలో విఫలమయ్యారని విమర్శించారు.  కాంగ్రెస్‌ శాసనసభాపక్షనేత మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నందున వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఈసీపై ఉందన్నారు. అందుకే బ్యాలెట్‌ విధానాన్ని తీసుకురావాలన్నారు.  

తప్పుదోవ పట్టించారు: కోదండరాం 
టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ అందరికీ ఓటుహక్కు ఉన్నదా, లేదా అనే దానిని బట్టి ఏ దేశమైనా ప్రజాస్వామ్య దేశమా, కాదా అనేది నిర్ధారణ అవుతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో  65 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని, కోర్టులను కూడా తప్పుదోవ పట్టించారన్నారు. 31, 32 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లు, కౌంటింగ్‌లో వచ్చిన ఓట్ల మధ్య తేడా ఉందని, దీంతో కొన్నిస్థానాల్లో ఫలితాలు తారుమారయ్యాయని, దీనిపై ఇప్పటివరకు ఈసీ కారణా లు చెప్పలేదన్నారు. కార్యక్రమంలో ఎంపీ నంది ఎల్లయ్య, సీపీఐ నేత అజీజ్‌ పాషా, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్‌నేతలు అంజన్‌కుమార్‌ యాదవ్, నిరంజన్, వినోద్‌రెడ్డి, ఫిరోజ్‌ఖాన్‌లు పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top