బీసీ, మైనార్టీలకు 50శాతం సీట్లు కేటాయింపు: ఉత్తమ్‌

Uttam Kumar Reddy: Competition Between Congress And TRS In Municipal Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌తో పాటుగా రిజర్వేషన్లు ముందుగా ప్రకటించకపోతే అభ్యర్థుల ఎంపిక ఎలా వీలవుతుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలకు ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉత్తమ్‌ కుమార్‌ మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మున్సిపల్‌ ఎన్నికలకు గత కొన్ని నెలల నుంచి సన్నద్ధం అవుతున్నామన్నారు. జనవరి 6వ తేదీన రిజర్వేషన్లు వస్తే 8వ తేదీన నామినేషన్లు వేయడం ఎలా వీలవుతుందని ప్రశ్నించారు. అధికార పార్టీకి ముందే రిజర్వేషన్లు తెలిసేలా ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల షెడ్యూల్‌లో కొన్ని మార్పులు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. రిజర్వేషన్లు తగ్గించడంతో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో బీసీలకు, మైనార్టీలకు 50శాతం సీట్లు కేటాయిస్తామని ఉత్తమ్‌ పేర్కొన్నారు.

అదేవిధంగా బీసీల రిజర్వేషన్లు తగ్గించినందుకు మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలని ఉత్తమ్‌ కమార్‌ మండిపడ్డారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగులకు రూ.3016 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఏడాదైనా అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో 24 లక్షల మందికి నిరుద్యోగ భృతి రావాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేసి టీఆర్ఎస్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. రైతులకు రుణమాఫీ ఇంతవరకు కేసీఆర్ అమలు చేయలేదని, రైతు బంధు సగం మంది రైతులకు కూడా అందలేదని దుయ్యబట్టారు. రుణమాఫీ, రైతుబంధు, డబుల్ బెడ్ రూం ఇళ్లు రావాలంటే కాంగ్రెస్‌కే ఓటేయాలని కోరారు. రాష్ట్రంలో బీజేపీ వేవ్ మోదీ హయాంలోనే రాలేదని తన చిన్నప్పుడు ఎంత ఉందో బీజేపీ బలం ఇప్పుడు అంతే ఉందని ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్ టీఆర్ఎస్‌ల మధ్యనే ఉంటుందని ఎంపీ ఉత్తమ్‌ పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top