
సాక్షి, హైదరాబాద్ : నగరాల్లో పెరిగిపోతున్న వాయు, ధ్వని కాలుష్యాలను అరికట్టడం, పచ్చదనాన్ని పెంపొందించడం, ప్రజల ఆరోగ్యాన్ని మరింతగా మెరుగుపర్చడం, జీవన ఖర్చులను తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ‘సైకిల్స్ ఫర్ చేంజ్’ చాలెంజ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా 141 నగరాల్లో సైకిల్ వినియోగంపై ప్రజలను చైతన్యవంతులను చేయనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని మూడు నగరాలను ఎంపిక చేసింది. అందులో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లున్నాయి. ఈ మూడు నగరాల్లో మొదటి దశలో భాగంగా సైక్లింగ్‌పై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆయా నగరాల్లో సైకిళ్లు అద్దెకు ఇవ్వడం, ఒకచోట ఉన్న సైకిల్‌ను మరోచోటకు తీసుకువెళ్లి నిర్దేశిత ప్రదేశంలో వదిలివెళ్లే అవకాశం కల్పించడంలాంటి వెసులుబాట్లు కల్పిస్తారు. ప్రజలు సొంతంగా ఉపయోగించుకునే వాటితో పాటు, దాతల ద్వారా సేకరించే సైకిళ్లను కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అందుబాటులో ఉంచుతారు.
21లోగా దరఖాస్తు చేసుకోవాలి..
‘సైకిల్స్ ఫర్ చేంజ్ చాలెంజ్’లో భాగస్వామ్యమయ్యేందుకు ఆయా నగరాల మున్సిపల్ కమిషనర్లు ఈ నెల 21లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి దశలో ఎంపిక చేసిన నగరాలను వడపోసిన తర్వాత రెండో దశకు వెళ్తామని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతానికి తాత్కాలికంగా చేపట్టే ఈ కార్యక్రమాలను భవిష్యత్తులో పూర్తిస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని, స్మార్ట్ మిషన్‌లో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు వెల్లడించింది. సైక్లింగ్ ఫ్రెండ్లీ నగరాలను రూపొందించడం ద్వారా ప్రజల జీవన విధానాల్లో, ఆర్థిక ప్రమాణాల్లో పెద్దఎత్తున మార్పులు తీసుకురావచ్చని, కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ తర్వాత నగరాల్లో 50–65 శాతం సైక్లింగ్ పెరిగిందని, వ్యక్తిగత రవాణా సౌకర్యం కింద సైక్లింగ్ ఉత్తమ మార్గమమని తెలిపింది. పాశ్చాత్య దేశాల్లో ప్రధాన నగరాల స్ఫూర్తితో సైక్లింగ్‌జోన్ల ఏర్పాటు, ప్రజల్లో అవగాహన కోసం వర్క్‌షాప్‌ల నిర్వహణలాంటి కార్యక్రమాలు ఈ చాలెంజ్‌లో భాగంగా అమలు చేయాల్సి ఉంటుందని పేర్కొంది.
గొప్ప అవకాశం: బి.వినోద్‌కుమార్
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ చేపట్టిన ఈ కార్యక్రమం నగర ప్రజలు తమ జీవనశైలిని మార్చుకునేందుకు మంచి అవకాశం. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. సైక్లింగ్ వల్ల కాలుష్యంతో పాటు ట్రాఫిక్ సమస్యా తగ్గుతుంది. వీధులు శుభ్రంగా, సురక్షితంగా ఉంటాయి. శారీరక దారుఢ్యాన్ని పెంచుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది.