కుదింపు కుదిరితేనే  రుణం..! | Sakshi
Sakshi News home page

కుదింపు కుదిరితేనే  రుణం..!

Published Tue, Aug 14 2018 11:40 AM

Unemployed Peoples Self Employed Loans Adilabad - Sakshi

ఆదిలాబాద్‌రూరల్‌: నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం రుణాలు అందజేసి ఆదుకుంటోంది. రూ.లక్ష నుంచి రూ.12లక్షల వరకు సబ్సిడీ రుణాలు పొందేందుకు నిరుద్యోగులు, చిరువ్యాపారులు, యువత పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్న విషయం విదితమే.. కాగా 2017–18 సంవత్సరానికి గాను కేటగిరి–1 కింద రూ.లక్ష యూనిట్‌ కోసం 3,882 మంది బీసీ లబ్ధిదారులు రెండు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నారు. ఆ సమయంలో రూ.50వేల యూనిట్‌ ఆప్షన్‌ లేకపోవడం, రూ.లక్ష యూనిట్‌ నుంచే రుణాల దరఖాస్తుల స్వీకరణ ఉండడంతో వాటికి అనుగుణంగానే దరఖాస్తులు సమర్పించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి మాత్రమే ఈ సబ్సిడీ రుణాలను అందజేసింది. మూడేళ్ల క్రితం ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2వేలకు పైగా బీసీ నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోగా, పూర్తిస్థాయిలో రుణాలకు పంపిణీ చేయలేదు. రూ.లక్ష యూనిట్‌ కింద దరఖాస్తు చేసుకున్న కొందరు లబ్ధిదారులకు మాత్రమే వీటిని అందజేసి చేతులు దులిపేసుకుంది. మూడేళ్లుగా రుణాలు అందించకపోవడంతో స్వయం ఉపాధి రుణాల కోసం వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా 2017–18 సంవత్సరానికి సంబంధించి బీసీలకు పంద్రాగస్టు వేడుకల సందర్భంగా రుణాలు అందజేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అది కూడా పూర్తిస్థాయిలో కాకుండా స్మాల్‌ ఇండస్ట్రీస్, స్మాల్‌ బిజినెస్‌ సెక్టార్‌ కింద రూ.50వేల యూనిట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మాత్రమే పంపిణీ చేయనుండడంతో మిగతా వారు ఆందోళన చెందుతున్నారు.

మిగతా వారికెప్పుడో..!
బీసీ స్వయం ఉపాధి రుణాల కోసం ప్రభుత్వం కేటగిరి–1 కింద రూ.1లక్ష యూనిట్‌ నుంచి మొదలు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరించింది. అప్పుడు రూ.50వేల యూనిట్‌ అని ఎక్కడా లేదు. అయితే రూ.లక్ష యూనిట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి రూ.50 వేలకు కుదించి రుణాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.లక్ష కాకుండా రూ.50వేల వరకు అవసరమున్న కుటీర పరిశ్రమల వారికి వంద శాతం సబ్సిడీపై పంద్రాగస్టు వేడుకల సందర్భంగా కుదింపునకు ఒప్పుకున్న వంద మంది లబ్ధిదారులకు అందజేయనుంది. కాగా, కేటగిరి–1లో 3,882 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోగా, ఆయా మండలాల ఎంపీడీఓల నుంచి ఆన్‌లైన్‌ ద్వారా 2,708 మంది జాబితా సంబంధిత శాఖలకు చేరుకున్నాయి.

కేటగిరి–2లో రూ.లక్ష పైనుంచి రూ.2లక్షల్లోపు 7,051 మంది ఆన్‌లైన్‌లో వివిధ రుణాల కోసం దరఖాస్తు చేసుకోగా, 5,364 మందికి సంబంధించిన జాబితా సంబంధిత శాఖకు చేరుకుంది. కేటగిరి–3లో రూ.2లక్షల పైనుంచి రూ.12లక్షల వరకు రుణాల కోసం 2,973 మంది ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోగా, 1305 మంది లబ్ధిదారులకు సంబంధించిన జాబితా బీసీ కార్పొరేషన్‌కు చేరుకుంది. మిగతా లబ్ధిదారుల జాబితా చేరాల్సి ఉంది. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా వంద మంది లబ్ధిదారులకు మాత్రమే రూ.50వేల యూనిట్‌కు సంబంధించి రుణాలు పంపిణీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందుకోసం రూ.50 లక్షల బడ్జెట్‌ను ప్రభుత్వం విడుదల చేసిందని ఆ శాఖాధికారులు పేర్కొన్నారు. రూ.లక్ష నుంచి రూ.12లక్షల దరఖాస్తు చేసుకొని రుణాల కోసం ఎదురుచూస్తున్న తమ పరిస్థితి ఏమిటని పలువురు ఆందోళన చెందుతున్నారు.

చిరువ్యాపారులకు ప్రాధాన్యం..
స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో చిరువ్యాపారు(స్మాల్‌ ఇండస్ట్రీస్, స్మాల్‌ బిజినెస్‌ సెక్టార్‌)లకు ప్రాధాన్యం కల్పిస్తున్నారు. వీరిని దృష్టిలో ఉంచుకొని రూ.50వేల వరకు రుణాలను పంద్రాగస్టు వేడుకల సందర్భంగా అందించనున్నారు. చిరువ్యాపారాలు చేసుకొని వీరు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం సబ్సిడీ రుణాలను అందించనుంది.  

బ్యాంక్‌ ఖాతాలో నగదు జమ చేయాలి
గతంలో ప్రభుత్వం ఇచ్చిన విధంగా ఈసారి కూడా స్వయం ఉపాధి రుణాలను అందించాలి. దరఖాస్తు చేసుకున్న వారికి పరికరాలు కాకుండా లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాలోనే నగదు జమ చేయాలి. పరికరాలను అందజేస్తే నాసిరకంతోపాటు దళారులకు మేలు కలిగించేలా అవుతుంది. లబ్ధిదారులకు మేలు చేకూరేలా ప్రభుత్వం ఆలోచించాలి. – చిక్కాల దత్తు, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు 

రూ.లక్ష రుణం అందించాలి..
పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం రూ.50వేల సబ్సిడీ వంద శాతానికి బదులు రూ.లక్ష రుణం వంద శాతం రాయితీపై కల్పించాలి. నేరుగా లబ్ధిదారుని ఖాతాలోనే సబ్సిడీ రుణాన్ని జమ చేయాలి. లేనిపక్షంలో లబ్ధిదారులు నష్టపోవాల్సి వస్తుంది. – మందపెల్లి శ్రీనివాస్, నాయీ బ్రాహ్మణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి 

వంద మందికి పంపిణీ..
వివిధ స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్న బీసీ లబ్ధిదారులకు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లాలోని వంద మంది లబ్ధిదారులకు రూ.50వేల చొప్పున రుణాలు అందించనున్నాం. రూ.లక్ష నుంచి కుదించి రూ.50వేలకు ఒప్పుకున్న లబ్ధిదారులకు మాత్రమే వీటిని అందించనున్నాం. వీటికి సంబంధించి రూ.50లక్షల నిధులు ప్రభుత్వం విడుదల చేసింది.     – ఆశన్న, జిల్లా బీసీ శాఖ అభివృద్ధి అధికారి  

Advertisement
Advertisement