
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సమ్మె పరిష్కారానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటుపై అభిప్రాయం తెలపాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంగళవారం రాత్రి ప్రగతి భవన్‌లో అడ్వకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్‌తో సమావేశమయ్యారు. హైకోర్టులో బుధవారం అనుసరించాల్సిన వ్యూహంపై ఆయనతో చర్చించారు. హైకోర్టు సూచనల మేరకు కమిటీ ఏర్పాటుకు అంగీకారం తెలిపితే ఏం జరుగుతుంది? అంగీకరించకపోతే ఏమవుతుంది? అనే అంశాలపై విస్తృతంగా చర్చించి ఓ అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. అయితే, ఈ భేటీ నిర్ణయాలను సీఎం కార్యాలయం బయటకు వెల్లడించలేదు.