
ఎన్నికల నోటిఫికేషన్‌పై స్టే విధిస్తూ హైకోర్టు ఆదేశాలు
నాలుగు వారాల్లో కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి ఆదేశం
ఆ తర్వాత 2 వారాల్లో రిప్లై కౌంటర్ వేయాలని పిటిషనర్లకు స్పష్టీకరణ
అప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ నిలిపివేత
అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ వాదనలు
సర్వే నుంచి బిల్లు వరకు ఏకగ్రీవ ఆమోదంతోనే జరిగాయి
ఎక్కడా.. ఏ రాజకీయ పార్టీ నుంచి వ్యతిరేకత రాలేదు
ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశాం.. జోక్యం సరికాదు
ఎలాంటి మధ్యంతర ఉత్తర్వుల జారీ వద్దని విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు బ్రేకులు వేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీచేసిన నోటిఫికేషన్‌ను గురువారం సాయంత్రం హైకోర్టు నిలిపివేసింది. నాలుగు వారాల్లో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తర్వాత మరో రెండు వారాల్లో రిప్లై కౌంటర్ వేయాలని పిటిషనర్లకు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. అప్పటివరకు ఎన్నికల నోటిఫికేషన్‌ను నిలిపివేస్తున్నట్లు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
రెండురోజులపాటు ఇరుపక్షాల నుంచి సుదీర్ఘ వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి (సీజే) ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. నోటిఫికేషన్ నిలిపివేయటానికి గల కారణాలతో కాపీ వెలువరిస్తామని పేర్కొంది. స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 9ని సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను విచారణకు అనుమతిస్తున్నామని ధర్మాసనం చెప్పింది. జీవో 9ని కొట్టివేయాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డితో పాటు మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు.
అలాగే మరో ప్రజాప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలైంది. ఈ పిటిషన్లలో తమ వాదనలూ వినాలని కోరుతూ కాంగ్రెస్ సహా కొందరు బీసీ నాయకులు దాదాపు 30 మంది ఇంప్లీడయ్యారు. ఈ పిటిషన్లపై సీజే జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం బుధవారం వాదనలు విన్నది. తిరిగి గురువారం మధ్యాహ్నం 2.15 గంటలకు మరోసారి విచారణ చేపట్టింది.
అన్ని పార్టీల ఏకగ్రీవ నిర్ణయం..
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఏ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం ఎందుకు పెంచాల్సి వచ్చిందో స్పష్టంగా వివరించారు. ‘రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి తిరిగి ప్రభుత్వం సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించింది. అందులో 98 శాతం మంది పాల్గొన్నారు. సర్వే తర్వాత 57.6 శాతం బీసీ జనాభా ఉన్నట్లు గణాంకాలు తేల్చాయి. దీనిపై నియామకమైన వన్‌మ్యాన్ కమిటీ పూర్తిగా పరిశీలించి ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని సిఫార్సు చేసింది.
ఆ మేరకు రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీచేసి, అసెంబ్లీలో పెట్టి ఏకగ్రీవంగా ఆమోదించింది. మార్చిలో ఈ ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కలి్పంచేందుకు వీలుగా.. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 265(ఏ) సవరణకు రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదాను జూలైలో గవర్నర్ ఆమోదం కోసం పంపించింది. ఆగస్టులో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సవరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది.
ఆ బిల్లును కూడా గవర్నర్‌కు పంపగా.. ఇవన్నీ అక్కడ పెండింగ్‌లో ఉన్నాయి. గడువులోగా గవర్నర్ ఆమోదం తెలపకుంటే చట్టంగా భావించాలని సుప్రీంకోర్టు ఇటీవలే స్పష్టం చేసింది. సర్వే, రిజర్వేషన్ల పెంపు, బిల్లుపై ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకత వ్యక్తం చేయలేదు’అని వివరించారు. సర్వేలో బీసీల శాతమేనా.. ఎస్సీ, ఎస్టీల జనాభా శాతాన్ని కూడా తేల్చారా? అని ధర్మాసనం ప్రశ్నించగా, అన్ని వర్గాలకు సంబంధించి ప్రభుత్వం సర్వే చేసిందని తెలిపారు.
వెనుకబాటుతనాన్ని పోగొట్టేందుకే..
బీసీల్లో రాజకీయ వెనుకబాటుతనాన్ని గుర్తించే ప్రభుత్వం రిజర్వేషన్ల పెంపు నిర్ణయం తీసుకుందని ఏజీ తెలిపారు. ‘అధిక జనాభా ఉన్న వర్గాలకు పల్లెల్లో అధికారమిస్తే వారు లబ్ధిపొంది రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఇందిరా సాహ్నీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇక్కడ వర్తించదు. విద్య, ఉద్యోగ రంగాలకు సంబంధించి మాత్రమే ఆ తీర్పు అమలవుతుంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై ఎలాంటి పరిమితి విధించలేదు.
తమిళనాడు ప్రభుత్వం, సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఆర్టీనెన్స్ జారీచేసిన తర్వాత మళ్లీ నోటీఫై చేయాల్సిన అవసరం లేదు. అసెంబ్లీ చేసిన చట్టానికి సూత్రప్రాయ ఆమోదం ఉంది. ప్రజామోదం మేరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకోవద్దు. ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ జారీ చేసింది (నోటిఫికేషన్ ప్రతులను సమర్పించారు). ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అడ్డుకోవడం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధం. ఈసీ అధికారాల్లో న్యాయస్థానం జోక్యం చేసుకోవడం సరికాదు. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దు’అని విజ్ఞప్తి చేశారు.
15 శాతం కులాలకు 33 శాతం ఓపెన్ కేటగిరీ ఉంటుంది...
ప్రభుత్వం తరఫున మరో న్యాయవాది రవివర్మ వాదనలు వినిపిస్తూ.. ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసును ప్రస్తావించారు. ‘పిటిషనర్లకు రిజర్వేషన్లను సవాల్ చేస్తే ప్రాథమిక హక్కు లేదు. ఓటు వేయడం, ఎన్నికల్లో పోటీ చేయడం ప్రాథమిక హక్కు కాదు. రాజ్యాంగంలో రిజర్వేషన్లపై ఎక్కడా 50 శాతం సీలింగ్ లేదు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు కలిపి 85 శాతం జనాభా ఉన్నారు. ఈ 85 శాతం జనాభాకు 67 శాతం మాత్రమే రిజర్వేషన్లు ఇస్తున్నారు. 15 శాతం ఉన్న ఇతర కులాలకు 33 శాతం ఓపెన్ కేటగిరీ ఉంటుంది.
ఈ రిజర్వేషన్లతో ఫార్వర్డ్ కులాలకు వచ్చే నష్టం లేదు. పిటిషనర్లకు పిటిషన్లు వేసే అర్హత లేదు. వాటిని కొట్టివేయాలి’అని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఈసీ జారీచేసిన నోటిఫికేషన్‌పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కాగా, హైకోర్టు ధర్మాసనం ఇన్‌ప్యూన్డ్ నోటిఫికేషన్‌పై స్టే అని చెప్పడటంతో దేన్ని నిలిపివేశారనేదానిపై సందిగ్ధం నెలకొంది. అధికారిక ఉత్తర్వుల కాపీ వస్తేగానీ కోర్టు ఆదేశాలపై స్పష్టత రానుంది.