
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు(Telangana BC Reservations) రిజర్వేషన్ల అంశంపై ఉత్కంఠ నెలకొంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై అన్ని పిటిషన్లను కలిపి హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఆరు పిటిషన్లను ఒకేసారి వింటామని హైకోర్టు చీఫ్ జిస్ట్ బెంచ్ స్పష్టం చేసింది.
హైకోర్టు ప్రశ్నలు:
- అసెంబ్లీలో రిజర్వేషన్ల బిల్లు పాస్ ఎప్పుడైంది?.
- ఆమోదం కోసం గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉందా?.
- బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం అవసరం ఉందా?.
- గవర్నర్ పేరు మీద జీవో జారీ చేశారా?.
- రిజర్వేషన్ల బిల్లు చట్టంగా మారిందా?.
పిటిషనర్ వ్యాఖ్యలు..
నోటిఫికేషన్ విడుదలైనా.. రిజర్వేషన్లు 50 శాతం మించితే ఎన్నికలు రద్దవుతాయనే నిబంధన ఉందని పిటిషనర్ తెలిపారు. 42 శాతం బిల్లు పాస్ అయింది కానీ.. గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉందని పిటిషనర్ తరఫు లాయర్లు చెప్పారు. ట్రిపుల్ టెస్టు పాస్ కాకుండానే రిజర్వేషన్లను పెంచారు. కేవలం వన్ మ్యాన్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లను పెంచారు. సుప్రీంకోర్టు తీర్పును అతిక్రమించారు అని తెలిపారు. రిజర్వేషన్ల బిల్లు పాస్ అయ్యింది కానీ, గవర్నర్ ఆమోదం తెలపలేదన్నారు. బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే. కానీ, రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.
అంతకుముందు.. రిజర్వేషన్లపై ప్రస్తుత పరిస్థితి ఏంటని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ సందర్భంగా రిజర్వేషన్లను 42 శాతం పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసిందని లాయర్లు తెలిపారు. అలాగే, రిజర్వేషన్లపై పిటిషన్‌ను సుప్రీంకోర్టు సైతం తిరస్కరించిందని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో బీసీల 42% రిజర్వేషన్లు కల్పించే వ్యవహారంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనన్న సస్పెన్స్ నెలకొంది.