బీసీ రిజర్వేషన్ల పెంపుపై అంత తొందరెందుకు?: హైకోర్టు | High Court questions Telangana govt on | Sakshi
Sakshi News home page

బీసీ రిజర్వేషన్ల పెంపుపై అంత తొందరెందుకు?: హైకోర్టు

Sep 28 2025 1:39 AM | Updated on Sep 28 2025 1:41 AM

High Court questions Telangana govt on

రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు  

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై అంత తొందరెందుకని సర్కార్‌ను హైకోర్టు ప్రశ్నించింది. గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లు ఆమోదం పొందే వరకు ఆగొచ్చు కదా.. పంచాయతీరాజ్‌ చట్ట సవరణ చేయకుండా జీఓ జారీ చేస్తే రిజర్వేషన్ల పెంపుపై మీ స్ఫూర్తి దెబ్బతింటుందని కదా అని ప్రశ్నించింది. చట్ట ప్రకారం తాము ఇచ్చే తీర్పుమేరకే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని హైకోర్టు తేల్చి చెప్పింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం తెలిపినా, ఆ బిల్లును ఇంకా గవర్నర్‌ ఆమోదించలేదని స్పష్టం చేసింది. బిల్లు పెండింగ్‌లో ఉండగా, జీఓ ఎలా జారీ చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ దశలో రిజర్వేషన్ల పెంపును ఆమోదించలేం.. అలాగని ఇప్పటికిప్పుడు ఎలాంటి నిలిపివేత ఆదేశాలు జారీ చేయలేమని చెప్పింది. 

ఇరువైపులా పూర్తి వాదనలు విని.. తుది ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణ అక్టోబర్‌ 8కి వాయిదా వేసింది. ఆలోగా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసినా పిటిషన్లు ముందే దాఖలు చేసినందును మెరిట్‌ ఆధారంగా విచారణ చేస్తామని చెప్పింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీఓను కొట్టివేయాలని కోరుతూ మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్‌ గ్రామానికి చెందిన బుట్టెంగారి మాధవరెడ్డితోపాటు మరొకరు హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సీజే సూచన మేరకు సీనియర్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం శనివారం విచారణ చేపట్టింది. 

చట్టప్రకారం 50 శాతానికి మించొద్దు  
పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు మమూర్‌రెడ్డి, ప్రభాకర్‌ వాదనలు వినిపిస్తూ.. ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 25 శాతం నుంచి 42 శాతానికి పెంచారు. ఇప్పటికే ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్లున్నాయి. తాజా పెంపుతో మొత్తం రిజర్వేషన్లు 67కు చేరాయి. ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధం. ఆర్టికల్‌ 200 ఉల్లంఘనే. మొత్తం వర్టికల్‌ రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఇందిరా సాహ్నీ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా, కృష్ణమూర్తి, వికాశ్‌కిషన్‌ గవాయ్‌.. కేసుల్లో అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. పంచాయతీరాజ్‌ చట్టంలోని సెక్షన్‌ 28ఏ ప్రకారం కూడా పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌ల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దు. 

చట్ట సవరణ చేయకుండా జీఓతో రిజర్వేషన్ల పెంపు చెల్లదు. బీసీ రిజర్వేషన్లు 35 శాతానికి పెంచుతూ 2018లో జీఓ ఇచ్చినా.. ఇదే హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ కొట్టివేసింది’అని పేర్కొన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఇంకా నోటిఫికేషన్‌ ఇవ్వలేదు కదా అని ప్రశ్నించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని మయూర్‌రెడ్డి చెప్పారు. రిజర్వేషన్ల పెంపుతో ఎస్సీలకు ఏం ఇబ్బందని.. మీ కోటా అలాగే ఉంటుందని కదా అని ధర్మాసనం అడిగింది. జనరల్‌ కోటాలో అవకాశం తగ్గుతుందని ప్రభాకర్‌ బదులిచ్చారు. ప్రధానంగా పిటిషన్లు వేసింది రిజర్వేషన్లతో ఇబ్బంది గురించి కాదని.. రాజ్యాంగ ఉల్లంఘనపైనని వెల్లడించారు.  

పెంపు రాజ్యాంగ ఉల్లంఘనే... 
రాజకీయ పార్టీలతో ఈ ఎన్నికలకు సంబంధం ఉండదు కదా అని ధర్మాసనం అడగ్గా.. పార్టీలు బలపరుస్తాయని ప్రభాకర్‌ చెప్పారు. ఎన్నికల్లో ఎవరు అభ్యర్థి అయినా ప్రజలే కదా ఎన్నికయ్యేది అని ధర్మాసనం పేర్కొంది. అలా భావిస్తే జీఓనే అవసరం లేదని, రాజ్యాంగం కొన్ని హద్దులు విధించిందని ప్రభాకర్‌ అన్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 17 శాతం చట్ట విరుద్ధంగా పెంచడం రాజ్యాంగ ఉల్లంఘనే అని మమూర్‌రెడ్డి అన్నారు. జీఓను అన్ని పార్టీలు సమర్థిస్తున్నట్టుంది.. ఏ పార్టీ వ్యతిరేకిస్తున్నట్టు లేదు కదా అని ధర్మాసనం అభిప్రాయపడింది. 

అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకగ్రీవ తీర్మానం చేశాయని అడ్వొకేట్‌ జనరల్‌ చెప్పారు. ‘బీసీ రిజర్వేషన్ల కోసం కమిషన్‌ వేసి జనాభాపై ప్రభుత్వం అధ్యయనం చేసింది. దాదాపు 53 శాతం బీసీ జనాభా ఉన్నందున 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఆ బిల్లును గవర్నర్‌కు పంపాం. గవర్నర్‌ ఆమోదం తెలిపాల్సి ఉంది. నోటిఫికేషన్‌ ఇచ్చినా, ఎన్నికల నిర్వహణకు దాదాపు 45 రోజుల సమయం పడుతుంది. ఇంత అత్యవసరంగా హౌస్‌ మోషన్‌ రూపంలో పిటిషన్లు దాఖలు చేయల్సిన అవసరం లేదు. దసరా సెలవుల తర్వాతకు వాయిదా వేయండి’అని కోరారు. 

నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత పిటిషన్‌ వేయడం సాధ్యం కానందునే అత్యవసర పిటిషన్లు వేశామని ప్రభాకర్‌ చెప్పారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌పై తీర్పు వచ్చే వరకు ఆగొచ్చు కదా, గతంలో గవర్నర్‌ వద్ద బిల్లు పెండింగ్‌లో ఉండగా జీఓ జారీ చేసిన ఘటనలు ఉన్నాయా అని ఏజీని ప్రశ్నించింది. హైకోర్టు.. సెప్టెంబర్‌ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని గడువు విధించిందని, అందుకే త్వరగా ప్రక్రియ చేపడుతున్నామని ఏజీ బదులిచ్చారు. ఎన్నికలు నిర్వహించమని మాత్రమే హైకోర్టు చెప్పిందని.. రిజర్వేషన్లు పెంచమని కాదని ప్రభాకర్‌ నివేదించారు. తమిళనాడు రిజర్వేషన్ల పెంపును కూడా సుప్రీంకోర్టు విచారణ జరుపుతోందన్నారు.  

సుప్రీంకోర్టు తీర్పు తర్వాత..  
ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకొని.. రేపటి వరకు అవకాశం ఇస్తాం.. ప్రభుత్వం నుంచి వివరాలు తెలుసుకొని నోటిఫికేషన్‌పై సమాచారం ఇవ్వాలని లేదా ఇప్పుడే అడిగి చెప్పాలని సూచించింది. 10 నిమిషాల తర్వాత హాజరైన ఏజీ ఉన్నతాధికారులు అందుబాటులో లేరన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు గవర్నర్‌ వద్ద బిల్లుపై 3 నెలలు ఆగితే నష్టమేముందని, ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహించొచ్చు కదా.. అప్పుడు రిజర్వేషన్లపై ఎలాంటి పిటిషన్‌ దాఖలు కాదు అని ధర్మాసనం అభిప్రాయపడింది. 

తాము ఇప్పుడు నిలుపుదల ఉత్తర్వులిస్తే ప్రభుత్వం రిజర్వేషన్ల పెంపునకు చేసిన ప్రయత్నమంతా వృథా అవుతుందని వ్యాఖ్యానించింది. పిటిషన్లలో తీర్పు వచ్చే వరకు నోటిఫికేషన్‌ వాయిదా వేయాలని ఆదేశించాలని ప్రభాకర్‌ కోరారు. ఏ సామాజిక వర్గానికి వ్యతిరేకం కాదని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ఉల్లంఘనపైనే పిటిషన్లు వేశామని మరోసారి స్పష్టం చేశారు. వాదనలు విన్న ధర్మాసనం.. ఇప్పటికిప్పుడు జీఓ 9పై ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ, విచారణ వాయిదా వేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement