ఆర్టీసీ సమ్మె; సంజయ్‌, జగ్గారెడ్డి అరెస్ట్‌ | TSRTC Strike Enters 11th Day on Tuesday | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ సమ్మె; సంజయ్‌, జగ్గారెడ్డి అరెస్ట్‌

Oct 15 2019 1:45 PM | Updated on Oct 15 2019 4:18 PM

TSRTC Strike Enters 11th Day on Tuesday - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 11వ రోజు కొనసాగుతోంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ లభించకపోవడంతో మంగళవారం కూడా ఆర్టీసీ కార్మిక సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తున్నాయి. బస్సు డిపోల ఎదుట ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేస్తున్నాయి. కార్మికులకు మద్దతుగా విపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నాయి. కాగా, ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికుల చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తానని సీనియర్‌ నాయకుడు కె. కేశవరావు ముందుకు వచ్చినా ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదు. మరోవైపు సమ్మె నేపథ్యంలో హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి.  

మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాల్లోని బస్సు డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వీరికి బీజేపీ, కాంగ్రెస్‌, సీఐటీయూ, వివిధ సంఘాల నేతలు సంఘీభావం తెలిపారు. నిజామాబాద్‌లో ఆర్టీసీ కార్మికులు, వామపక్ష పార్టీల నాయకులు కలిసి మానవహారం నిర్వహించారు. కరీంనగర్ బస్టాండ్‌లో సీఎం కేసీఆర్, మంత్రులకు పిండ ప్రదానం చేస్తూ ఆర్టీసీ కార్మికులు నిరసన తెలిపారు. వివిధ పార్టీల రాజకీయ నాయకులు మోకాళ్లపై నిలబడి ఆందోళన వ్యక్తం చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బస్టాండ్ ముందు కార్మికులు చేపట్టిన మానవహారానికి కాంగ్రెస్, కేవీపీఎస్‌ నాయకుల సంఘీభావం తెలిపారు. సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద రాస్తారోకోలో ఆర్టీసీ బస్సును కార్మికులు అడ్డుకోవడంతో పోలీసులతో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఖమ్మం రీజియన్ ఆధ్వర్యంలో మంచి కంటి భవన్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సత్తుపల్లి పట్టణంలో పలు రాజకీయ పార్టీ నాయకులు, ఆదివాసీ సంఘా నాయకులతో భారీ ర్యాలీ నిర్వహించి రింగ్ సెంటర్‌లో ఆర్టీసీ కార్మికులు మానవహారం చేపట్టారు. కొత్తగూడెంలో ఆర్టీసీ కార్మికులు, అఖిలపక్ష పార్టీల నేతలు రాస్తారోకో చేశారు.

బీజేపీ నిరసన, సంజయ్‌ అరెస్ట్‌
కరీంనగర్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా బీజేపీ చేపట్టిన నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. బస్‌స్టాండ్‌ వద్ద ఎంపీ బండి సంజయ్ కుమార్‌తో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
అరెస్ట్ చేసి సంజయ్‌ను పోలీసు స్టేషన్‌కు తరలిస్తుండగా బీజేపీ కార్యకర్తలు అడుగడుగునా అడ్డుకున్నారు. ఆర్టీసీ కార్మికులకు సంఘీభావంగా పెద్దపల్లిలోనూ బీజేపీ రాస్తారోకో నిర్వహించింది.

జగ్గారెడ్డి అరెస్ట్‌, ఉద్రిక్తత
సంగారెడ్డిలో ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఆందోళనకు సిద్ధమైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసుల వాహనంపై ఆందోళనకారులు రాళ్ళ దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఇంటిని ముట్టడిస్తానని జగ్గారెడ్డి సోమవారం హెచ్చరించిన సంగతి తెలిసిందే. (చదవండి: హైదరాబాద్‌ వస్తా.. ఘెరావ్‌ చేస్తా)

హైకోర్టులో పిటిషన్లు
ఆర్టీసీ ఉద్యోగులకు గత నెల జీతాలు చెల్లించేల యాజమాన్యాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 49 వేల 190 మందికి ఆర్టీసీ కార్మికులకు తక్షణమే జీతాలు చెల్లించేలా ఆదేశించాలని పిటిషనర్‌ కోరారు. సెప్టెంబర్ నెల జీతాలు ఇప్పటికీ చెల్లంచలేదంటూ పిటిషనర్‌ కోర్టుకు దృష్టి తీసుకొచ్చారు. దీనిపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడాన్ని సవాల్‌ చేస్తూ అఖిల్‌ అనే విద్యార్థి హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement