సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ చరిత్రలో భారీ ప్రాణ నష్టం సంభవించిన రెండో అతిపెద్ద ప్రమాదం ఇది. చేవెళ్ల సమీపంలో ఆర్టీసీ అద్దె బస్సును టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో 19 మంది చనిపోయిన విషయం తెలిసిందే. 2018 సెప్టెంబరు 11న కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం నుంచి ఘాట్ రోడ్డు మీదుగా వస్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి దిగువకు దొర్లిపోవటంతో ఏకంగా 64 మంది చనిపోయారు. ఇదే ఆర్టీసీ చరిత్రలో అతిపెద్ద దుర్ఘటన. ఆ తర్వాత అంతమంది చనిపోయింది మాత్రం సోమవారం నాటి ప్రమాదంలోనే.
⇒ 2013 అక్టోబరు 30న మహబూబ్‌నగర్ జిల్లా పాలెం సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బెంగళూరు నుంచి వస్తూ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల కల్వర్టు గోడను ఢీకొని అగ్నికి ఆహుతైన దుర్ఘటనలో 45 మంది చనిపోయారు. తెలంగాణ ఆవిర్భావానికి కొన్ని నెలల ముందు జరిగిన ఈ ఘటనలో ప్రమాదానికి గురైంది ప్రైవేటు బస్సు.
అది దేశ చరిత్రలోనే భారీ ప్రమాదాల్లో ఒకటి
కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయం నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు లోయలోకి పడిపోయిన దుర్ఘటన దేశ చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది. దాదాపు 12 లక్షల కిలోమీటర్లు తిరిగిన పాత డొక్కు బస్సును నడపటం పెను ప్రమాదానికి కారణమైంది. దేవాలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో, ఈ బస్సులో 104 మంది ఎక్కారు. నిరోధించాల్సిన డ్రైవర్, కండక్టర్లు అధిక టికెట్ ఆదాయం ఆశతో నియంత్రించలేదు.
రెగ్యులర్‌గా దిగాల్సిన మార్గంలో కాకుండా తక్కువ దూరం ఉండే మరో నిషేధిత మార్గంలో డ్రైవర్ నడిపారు. ఓవర్ లోడ్, పాత డొక్కు బస్సు, ప్రమాదకర మార్గం... అన్ని లోపాలు వెరసి బస్సు అదుపు తప్పి లోయలోకి జారిపోయింది. ఆ తర్వాత ఎక్కువ ప్రాణనష్టం జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదం సోమవారం చేవెళ్ల సమీపంలో చోటు చేసుకున్నదే.  
⇒  2016లో ఖమ్మం జిల్లా నాయకునిగూడెం వద్ద కెనాల్‌లోకి ఓ ప్రైవేటు బస్సు దూసుకెళ్లిన దుర్ఘటనలో 10 మంది ప్రయాణికులు మృతి చెందారు. 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
