‘ఓడీ’.. కార్మిక సంఘాల్లో వేడి

TS Govt Plans To RTC Employees Welfare Council Instead Of Unions - Sakshi

కొనసాగింపుపై సందేహపడుతున్న ఉద్యోగ సంఘాల నేతలు

ఆర్టీసీలో గుర్తింపు సంఘం స్థానంలో ఎంప్లాయిస్‌ వెల్ఫేర్‌ కౌన్సిల్‌ 

ఏర్పాటుతో కొత్త ఆలోచనలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రధాన ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం ఇచ్చే ఆన్‌డ్యూటీ సదుపాయం రద్దయి ఏడాది కావస్తోంది. దీన్ని ఇప్పటి వరకు పునరుద్ధరించలేదు. అయితే దీనిపై ప్రభుత్వం ఎప్పటికైనా ఉత్తర్వులు జారీ చేస్తుందన్న ఉద్దేశంతో ప్రధాన ఉద్యోగ సంఘాల నేతలు ఆ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. కొన్ని సంఘాల నేతలు మాత్రం ఈ జాప్యం వెనుక ఉన్న ఆంతర్యం అంచనా వేసో, మరో కారణమో గానీ గత జూలై నుంచే విధులకు హాజరవుతున్నారు. తాజాగా ఆర్టీసీలో కార్మిక సంఘాలకు ప్రత్యామ్నాయంగా ఎంప్లాయిస్‌ వెల్ఫేర్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యం లో ఉద్యోగ సంఘాల నేతలు ఆలోచనల్లో పడ్డారు. ఇటు ఉపాధ్యాయులకు 54 సంఘాల ఉన్న నేపథ్యంలో గుర్తింపు సంఘం ఒకటే ఉంటే చాలన్న యోచనలో ప్రభుత్వం ఉందన్న వార్తలు రావడం ఆ సంఘాల నేతలను కలవరపరుస్తోంది.

గతంలో 27 సంఘాలకు అవకాశం..
ప్రభుత్వ సర్వీసు రంగంలోని వివిధ శాఖల్లో పని చేసే ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీ సుకెళ్లి పరిష్కరించేలా కృషి చేసేందుకు సంఘాలు ఏర్పడ్డాయి. అందులో ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ తమ పరిధిలో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేసి గుర్తింపు పొందిన సంఘాలకు శాశ్వ త సభ్యత్వం ఇచ్చింది. మరికొన్నింటికి ఏడాది ప్రాతిపదికన గుర్తింపు ఇచ్చింది. ప్రస్తుతం జా యింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో టీఎన్‌జీవో, క్లాస్‌–4, ఎస్టీయూ, పీఆర్‌టీయూ–టీఎస్, యూటీఎఫ్, ట్విన్‌ సిటీస్‌ గవర్నమెంట్‌ డ్రైవర్స్‌ అసోసియేషన్, రెవెన్యూ సర్వీసు అసోసియేషన్, సెక్రటేరియట్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్, తెలంగాణ గవర్నమెంట్‌ డ్రైవర్స్‌ అసోసియేషన్‌ వంటి కొన్ని సం ఘాలున్నాయి. ఏడాది కాల పరిమితితో మరికొ న్ని ఉన్నాయి. 

ఇలా జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో ఉన్న సంఘాలతోపాటు అందులోని లేని వాటిని కలిపి మొత్తంగా 27 సంఘాలకు చెందిన రాష్ట్ర, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు గతేడాది ప్రభుత్వం ఆన్‌డ్యూటీ సదుపాయం కల్పించింది. గు ర్తింపు పొందిన సంఘాల రాష్ట్ర, జల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు 21 స్పెషల్‌ క్యాజువల్‌ లీవులు ఇచ్చింది. ఈ సదుపాయం కూడా గతేడాది డిసెంబర్‌తో ముగిసింది. మరోవైపు రాష్ట్రంలో ఇప్పుడు మొత్తంగా 180 వరకు సంఘాలున్నాయి. అందులో టీచర్లకు చెందినవే 57 ఉన్నాయి. ఈ నేపథ్యంలో సంఘాల విషయాన్ని ఏం చేయాలి.. సర్వీసు సెక్టార్‌లోనూ గుర్తింపు సంఘం వంటి నిబంధన సాధ్యమా? అన్న ఆలోచనలు ప్రభుత్వం చేస్తోంది. తాజాగా ఆర్టీసీ అంశం తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఉద్యోగ వర్గాల్లో తమ సంఘాల ఉనికిపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top