‘పరిషత్‌’ ఏకగ్రీవాల్లో టీఆర్‌ఎస్‌ జోరు | TRS Shown A Tremendous Performance In Local Bodies Unanimous | Sakshi
Sakshi News home page

‘పరిషత్‌’ ఏకగ్రీవాల్లో టీఆర్‌ఎస్‌ జోరు

Published Sat, May 4 2019 7:39 AM | Last Updated on Sat, May 4 2019 7:39 AM

TRS Shown A Tremendous Performance In Local Bodies Unanimous - Sakshi

వివిధ జిల్లాల పరిధిలో ఏకగ్రీవమైన 69 ఎంపీటీసీల్లో టీఆర్‌ఎస్‌ 67, కాంగ్రెస్‌ 2 కైవసం చేసుకున్నాయి.

సాక్షి, హైదరాబాద్‌: తొలిదశ పరిషత్‌ ఎన్నికల ఏకగ్రీవాల్లో టీఆర్‌ఎస్‌ జోరు ప్రదర్శించింది. వివిధ జిల్లాల పరిధిలో ఏకగ్రీవమైన 69 ఎంపీటీసీల్లో టీఆర్‌ఎస్‌ 67, కాంగ్రెస్‌ 2 కైవసం చేసుకున్నాయి. జగిత్యాల జిల్లా వెల్గటూరు జెడ్పీటీసీ, నిజామాబాద్‌ జిల్లా మాక్లూరు జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవమవగా వాటిని కూడా టీఆర్‌ఎస్‌ తన ఖాతాలో వేసుకుంది. తొలి విడత ఎన్నికల్లో భాగంగా సిద్దిపేట జిల్లాలో 96 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా వాటిలో 10 స్థానాలు టీఆర్‌ఎస్‌ పక్షాన ఏకగ్రీవమయ్యాయి. కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో ఆరేసి ఎంపీటీసీ సీట్లను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది.

ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో చెరో ఎంపీటీసీ సీటును కాంగ్రెస్‌ గెలుచుకోగలిగింది. ఈ నెల 6న (సోమవారం) మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగాల్సి ఉండగా గత నెల 28న నామినేషన్ల ఉపసంహరణలు పూర్తయ్యాక ఎక్కడెక్కడ ఒక్కో అభ్యర్థే మిగిలారన్న దానిపై స్పష్టత వచ్చింది. సాధారణంగా నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిశాక ఏదైనా స్థానంలో చెల్లుబాటయ్యే నామినేషన్‌ ఒక్కటే మిగిలితే సదరు అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తారు.

సీట్ల వేలం మొదలుకొని నామినేషన్లు వేయకుండా అభ్యర్థులకు బెదిరింపులు, నామినేషన్ల ఉపసంహరణకు ఒత్తిళ్లు పనిచేస్తున్నాయని గతంలో వచ్చిన వార్తల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారుల నుంచి క్లియరెన్స్‌ వచ్చాకే జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఏకగ్రీవాలను రిటర్నింగ్‌ అధికారులు ప్రకటించాలని ఇటీవల రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఆదేశించింది. ఈ పరిణామాలతో ఏకగ్రీవాలకు సంబంధించి జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు సంబంధిత రిటర్నింగ్‌ అధికారులు నివేదికలు పంపించారు. వాటిని పూర్తిస్థాయిలో సమీక్షించాక ఏకగ్రీవాలపై జిల్లా కలెక్టర్లు, అధికారులు నిర్ణయం ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement