మంత్రులు పొన్నం, జూపల్లి, కొండా సురేఖ, వాకిటి శ్రీహరితో కలిసి కేబినెట్ నిర్ణయాల వివరాలు వెల్లడిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
న్యాయ నిపుణులతో చర్చించి తుది నిర్ణయం
రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీర్మానం
స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత
గవర్నర్ ఆమోదంతో త్వరలో ఆర్డినెన్స్ ద్వారా చట్ట సవరణ
ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో టీబీఎంకు స్వస్తి..
సరికొత్త డ్రిల్లింగ్ పరిజ్ఞానంతో తవ్వకాలు
1,500 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీ యూనిట్ల ఏర్పాటు
మంత్రివర్గం కీలక నిర్ణయాలు.. వెల్లడించిన మంత్రి పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎన్నికల నిర్వహణపై వచ్చే నెల 7వ తేదీన తుది నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం.. ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై న్యాయ నిపుణుల సలహాల ప్రకారం ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం గురువారం రాష్ట్ర సచివాలయంలో సుదీర్ఘంగా సమావేశమై పలు అంశాలపై చర్చించింది.
అనంతరం రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్‌తో కలిసి సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సచివాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై నవంబర్ 3న హైకోర్టులో జరగనున్న విచారణలో వెలువడే ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. నవంబర్ 7న మళ్లీ మంత్రివర్గ సమావేశం నిర్వహించి రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ తీర్మానించినట్లు వివరించారు.
ఎస్‌ఎల్‌బీసీలో టీబీఎంకు స్వస్తి
శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రాజెక్టు సొరంగం తవ్వకాల కోసం ఇప్పటి వరకు అనుసరించిన టన్నెల్ బోరింగ్ మెషిన్ (టీబీఎం) విధానాన్ని పక్కనబెట్టి, అత్యాధునిక డ్రిల్లింగ్ పరిజ్ఞానంతో మిగతా పనులు పూర్తిచేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. దివాళా పరిష్కార ప్రక్రియను ఎదుర్కొంటున్న నిర్మాణ సంస్థ జయప్రకాశ్ అసోసియేట్స్‌తో గతంలో చేసుకున్న ఒప్పందాన్నే కొనసాగిస్తూ ప్రభుత్వంపై అదనపు భారం పడకుండా 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభం నాటికి లేదా 2028 జూన్‌లోగా ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది.
జలయజ్ఞంలో భాగంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి శ్రీశైలం జలాశయం నుంచి గ్రావిటీ ద్వారా ఫ్లోరైడ్ బాధిత నల్లగొండ జిల్లాకు 30 టీఎంసీల కృష్ణా జలాలను తరలించి 3.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి ప్రారంభించిన ఎస్‌ఎల్‌బీసీ సొరంగ నిర్మాణం ప్రాజెక్టును గత బీఆర్‌ఎస్ సర్కారు నిర్లక్ష్యం చేసిందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. 44 కి.మీ.ల సొరంగం తవ్వాల్సి ఉండగా, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 31–32 కి.మీల తవ్వకాలు జరిగాయని, ఆ తర్వాత 10 ఏళ్లలో బీఆర్‌ఎస్ సర్కారు 2–2.5 కి.మీ.ల మేర మాత్రమే తవ్వకాలు జరిపిందని విమర్శించారు.
ప్రపంచంలోనే అతి పొడువైన 44 కిలోమీటర్ల సొరంగంలో రెండు వైపుల నుంచి ఇప్పటివరకు 35 కిలో మీటర్ల సొరంగం తవ్వకం పూర్తయింది. మిగిలిన 9 కిలోమీటర్ల సొరంగం తవ్వడానికి అటవీ, పర్యావరణ, వన్య ప్రాణులకు ఇబ్బంది లేకుండా అత్యాధునిక పరిజ్ఞానాన్ని వాడాలని కేబినెట్ తీర్మానించింది.
1,500 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీ యూనిట్లు...
రాష్ట్రంలో 1,500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ యూనిట్ల ఏర్పాటు ప్రతిపాదనలకు రాష్ట్ర కేబినెట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ యూనిట్లను ఎక్కడ ఏర్పాటుచేయాలనే అంశంపై విద్యుత్ శాఖ తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది. రామగుండంలో 52 ఏళ్ల క్రితం నిర్మించిన 62.5 మెగావాట్ల థర్మల్ బీ–స్టేషన్‌ను తొలగించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఇప్పుడున్న విద్యుత్తు అవసరాలు, రాబోయే పదేళ్ల విద్యుత్ డిమాండ్ అంచనాలకు అనుగుణంగా భవిష్యత్తు ప్రణాళిక తయారు చేయాలని విద్యుత్ శాఖను కేబినెట్ ఆదేశించింది. సౌర, బ్యాటరీ స్టోరేజీ, రివర్స్ పంపింగ్ ద్వారా అందుకు అవసరమైన విద్యుదుత్పత్తికి వ్యూహాలు సిద్ధం చేయాలని కోరింది.
ఆ నిబంధన ఎత్తివేత..
ఇద్దరికి మించి సంతానం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని ప్రస్తుతం అమ ల్లో ఉన్న నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ ఆ మోదం తెలిపింది. ఇందుకోసం తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 21(3)ని తొలగించాలని నిర్ణయించింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున ఆర్డినెన్స్ ద్వారా చట్టసవరణ కోసం గవర్నర్‌కు ఫైల్ పంపాలని నిర్ణయించినట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. నిర్మాణంలో ఉన్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, ఎల్బీనగర్, సనత్‌నగర్, అల్వాల్ టిమ్స్ ఆస్పత్రులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు వెల్లడించారు.


