లాహోటీ చూపు.. బీజేపీ వైపు

TRS Senior Leader Join In BJP Rangareddy - Sakshi

సాక్షి,  కొడంగల్‌ (రంగారెడ్డి): కొడంగల్‌ టీఆర్‌ఎస్‌లో అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. సీనియర్‌ నాయకుడు శ్యాసం రామకృష్ణ మౌనంగా ఉన్నారు. ఎంపీ జితేందర్‌రెడ్డి ప్రధాన అనుచరుడు, కొడంగల్‌ టీఆర్‌ఎస్‌ నాయకుడు పున్నం చంద్‌ లాహోటీ బీజేపీ వైపు చూస్తున్నారు. ఆయనకు కొడంగల్‌ అసెంబ్లీ టికెట్‌ ఇవ్వడానికి బీజేపీ అధిష్టానంలో చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. పున్నంచంద్‌ గతంలో బీజేపీలో క్రీయాశీలకంగా వ్యవహరించారు. పలుమార్లు ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు.

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ద్వారా ప్రజల్లో మంచి పరిచయాలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ వల్ల నష్టపోయిన వారు.. నామినేటెడ్‌ పోస్టులు దక్కని వారు కూటమిగా ఏర్పడుతున్నారు. పున్నంచంద్‌ లాహోటీని ఎన్నికల బరిలో నెలబెట్టి పాత కాపుల సత్తా చాటాలని చూస్తున్నారు. ఎంపీ జితేందర్‌రెడ్డి పలుమార్లు పున్నం చంద్‌కు ఫోన్‌ చేసి సముదాయించినట్లు సమాచారం. ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయంపై పున్నం చంద్‌ లాహోటీని వివరణ కోరగా వారం రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.

నాయకుల కినుక.. 
కొడంగల్‌కు చెందిన పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. టీఆర్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ సేవ చేస్తున్న తమకు గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణా ఉద్యమంలో క్రీయాశీలకంగా వ్యవహరించిన వ్యక్తులకు ప్రస్తుతం పార్టీలో సరైన స్థానం లేకుండా పోయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమాన్ని ఏకతాటిపై నడిపించి సకల జనుల సమ్మెను విజయవంతం చేసిన పాత కాపులు ఇప్పుడు కనిపించడం లేదనే ప్రచారం జరుగుతోంది. టీఆర్‌ఎస్‌ పార్టీ నియోజకవర్గ తొలి ఇన్‌చార్జ్‌ శ్యాసం రామకృష్ణతో పాటు నేటితరం నాయకుడు పున్నం చంద్‌ లాహోటీ వరకు టీఆర్‌ఎస్‌పై కినుక వహిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top