సీఈసీకి రీడిజైన్‌ ‘కారు’ గుర్తు: వినోద్‌

TRS seeks to redesign Car symbol - Sakshi

కారును పోలిన గుర్తును తొలగించాలని మరోసారి వినతి

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం సూచన మేరకు టీఆర్‌ఎస్‌ పార్టీ రీడిజైన్‌ చేసిన ‘కారు’లోగోను సమర్పించింది. టీఆర్‌ఎస్‌కు కేటాయించిన ఎన్నికల చిహ్నం ‘కారు’బ్యాలెట్‌ పేపర్‌పై సరిగా కనిపించడం లేదని గతేడాది డిసెంబర్‌ 27న ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేంద్ర ఎన్నికల సంఘానికి విన్నవించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ‘కారు’గుర్తును రీడిజైన్‌ చేసి సమర్పించాలని సూచించింది. ఓటర్లకు సులువుగా ‘కారు’గుర్తు కనిపించేలా రీడిజైన్‌ చేసి సీఈసీకి సమర్పించినట్లు ఎంపీ బి.వినోద్‌కుమార్‌ తెలిపారు. అయితే ముఖ్యమంత్రి చేసిన ఇతర వినతులను పట్టించుకోలేదని తాజాగా సీఈసీకి రాసిన లేఖలో వినోద్‌ పేర్కొన్నారు.

ట్రక్కు, రైతుతో కూడిన ట్రాక్టర్, ఇస్త్రీ పెట్టె, కెమెరా వంటి ఎన్నికల గుర్తులు టీఆర్‌ఎస్‌ ఎన్నికల చిహ్నమైన ‘కారు’గుర్తును పోలి ఉన్నాయని, అందువల్ల వీటిని ఎవరికీ కేటాయించకుండా ఉండేందుకు వీలుగా తొలగించాలని చేసిన వినతిపై సీఈసీ స్పందించలేదని ప్రస్తావించారు. ‘కారు’ను పోలిన గుర్తులను ఇతరులకు కేటాయించడం వల్ల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ నష్టపోయిందని వివరిం చారు. ముఖ్యంగా సమాజ్‌వాదీ ఫార్వార్డ్‌ బ్లాక్‌ పార్టీకి కేటాయించిన ట్రక్కు గుర్తు విషయాన్ని గమనించాలని కోరారు. ఆ పార్టీ టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల పేర్లను పోలిన అభ్యర్థులకు, అదే పేరుతో ఉన్న అభ్యర్థులకు టికెట్లు కేటాయించడం ద్వారా ఓటర్లను గందరగోళపరుస్తూ ఉద్దేశపూర్వక నష్టకారక చర్యలకు దిగుతోందని వివరించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇదే తరహా ప్రయత్నాలు జరిగే పరిస్థితి ఉందని, అందువల్ల ట్రక్కు గుర్తును తొలగించాలని కోరారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top