పరిషత్‌లన్నింటా పాగాకు కసరత్తు!

TRS New target  Win all 32 Zilla Parishad Chair Posts - Sakshi

పల్లె నుండి ఢిల్లీ వరకు గులాబీమయం 

సంపూర్ణ ఆధిపత్యం దిశగా అడుగులు  

పరిషత్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు 

నేడు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ భేటీ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో సంపూర్ణ ఆధిప్యతం దిశగా తెలంగాణ రాష్ట్ర సమితి అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పలు వ్యూహాలు సిద్ధం చేసింది. భారీ మెజారిటీతో రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ఆ తర్వాత అన్ని ఎన్నికల్లోనూ ఇదేరకంగా సత్తా చాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. జనవరిలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో అత్యధికచోట్ల టీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులు ఏకపక్షంగా విజయం సాధించారు. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలపైనా టీఆర్‌ఎస్‌ ధీమాతో ఉంది. మిత్రపక్షం ఎంఐంఎంతో కలసి రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో కచ్చితంగా గెలుపు తమదేనని గట్టిగా చెబుతోంది.

అసెంబ్లీ, గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఘన విజయాలు... లోక్‌సభ ఎన్నికల్లో అనుకూల ఫలితాలపై అంచనాలతో ఉన్న టీఆర్‌ఎస్‌ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి ఆధిపత్యం, పట్టు సాధించే దిశగా కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లా, మండల పరిషత్‌లను కైవసం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. జిల్లాలు, మండలాల పునర్విభజనతో రాష్ట్రంలో జిల్లా పరిషత్‌ల సంఖ్య 32, మండల పరిషత్‌ల సంఖ్య 535కు పెరిగింది. రాష్ట్రంలో 5,857 ఎంపీటీసీ స్థానాలున్నాయి. అన్ని జిల్లా పరిషత్‌ల చైర్‌పర్సన్, అన్ని ఎంపీపీల అధ్యక్ష పదవులను గెలుచుకోవడం లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ వ్యూహం సిద్ధం చేసింది. స్థానిక సంస్థల్లో టీఆర్‌ఎస్‌ గెలిస్తేనే రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి లక్ష్యాలు పూర్తిగా నెరవేరుతాయని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు.

పరిషత్‌ ఎన్నికల్లో పరిపూర్ణ విజయమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన అధికార పార్టీ రాష్ట్ర కార్యవర్గం కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. తెలంగాణ భవన్‌లో సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు మొదలయ్యే ఈ సమావేశానికి టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్లు, కార్పొరేషన్‌ చైర్మన్లు, ఎంపీ అభ్యర్థులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనాయకులు హాజరుకానున్నారు. అధికారంలో ఉన్న పార్టీని గెలిపించడం వల్ల స్థానిక సంస్థల్లోనూ అభివృద్ధి వేగంగా జరుగుతుందని, ఈ దిశగా ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నించాలని ఉద్బోధించనున్నారు.  

గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ... 
తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌తో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ దాదాపు నెలరోజులుగా గవర్నర్‌ను కలవలేదు. వారంలోపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ రానుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ మర్యాదపూర్వకంగా గవర్నర్‌ను కలిశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన అంశాలకు సంబంధించి ఇటీవల జరిగిన రెండు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశం గురించి వీరు చర్చించినట్లు తెలిసింది. లోక్‌సభ ఎన్నికలు, తాజా రాజకీయ అంశాలపైనా వీరిద్దరు మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top