సెంటిమెంట్‌ బ్రేక్‌ చేశా.. 

TRS MLA Allola Indrakaran Reddy Forest Minister - Sakshi

సాక్షి, మంచిర్యాల: దేవాదాయశాఖ మంత్రిగా ఉన్న వాళ్లు మళ్లీ గెలవరనే సెంటిమెంట్‌ను తాను బ్రేక్‌ చేశానని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్‌లో ఐకే రెడ్డి మంత్రిగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవాదాయ శాఖ మంత్రిగా కేసీఆర్‌ రెండోసారి బాధ్యతలు అప్పగించడం ఎంతగానో సంతృప్తి నిచ్చిందన్నారు. మే 1వ తేదీ నుంచి అన్ని ప్రముఖ దేవాలయాల్లో ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. అలాగే అటవీచట్టంలో సమూల మార్పులు తీసుకువస్తామని, అడవుల సంరక్షణపై ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామన్నారు. జంగల్‌ బచావో, జంగల్‌ బడావో అనే నినాదంతో ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తామన్నారు. కొత్త జిల్లాల్లో జిల్లా కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు.

రెండోసారి మంత్రిగా... 
రాష్ట్ర మంత్రిగా ఇంద్రకరణ్‌రెడ్డి రెండోసారి బాధ్యతలు స్వీకరించారు. గత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అల్లోల దేవాదాయ, న్యాయశాఖ మంత్రిగా కొనసాగారు. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో మరోసారి మంత్రిగా అవకాశం వచ్చింది. ఈసారి గతంలో ఉన్న దేవాదాయ, న్యాయశాఖతో పాటు అటవీ, పర్యావరణ శాఖలను అప్పగించారు. గతంలో ఉమ్మడి అదిలాబాద్‌ జిల్లా నుంచి జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి మంత్రులుగా ఉండగా, ఈ సారి ఒక్క అల్లోలకే అవకాశం దక్కింది. అడవులకు పెట్టింది పేరైన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకే మరోసారి అటవీశాఖ దక్కడం విశేషం. 

మంత్రికి పలువురి శుభాకాంక్షలు 
రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఐకే రెడ్డికి పలువురు ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, విఠల్‌రెడ్డి, రాథోడ్‌ బాపురావు, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు విఠల్‌రావు, సత్యనారాయణగౌడ్‌ తదితరులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top