జెడ్పీ పీఠంపై ‘గులాబీ’ గురి..

TRS Focuses To Get ZPTC Seat In Sangareddy - Sakshi

సాక్షి, సంగారెడ్డి: జిల్లా పరిషత్‌ పీఠంపై గులాబీ నేతలు కన్నేశారు. ఇటీవల వరుస విజయాలతో మంచి ఊపుమీదున్న టీఆర్‌ఎస్‌ నుంచి జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అప్పుడే పైరవీలు మొదలైనట్లు సమాచారం. గత సంవత్సరం డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతోపాటు పంచాయతీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ విజయ బావుటా ఎగుర వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీఆర్‌ఎస్‌కు మంచి అవకాశాలు ఉండడంతో ఈ జిల్లాల్లో జెడ్‌పీ పదవిని చేజిక్కించుకునే విధంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే తమకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నట్లు సమాచారం.

కాగా వారు ముఖ్యమంత్రి, గులాబీ బాస్‌ కేసీఆర్‌ జెడ్పీ చైర్మన్లను, చైర్‌పర్సన్లను ప్రకటిస్తారని, తమ చేతుల్లో ఏమీ లేదని కొంతమంది ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ఆశావహులకు తెలియజేస్తున్నట్లు సమాచారం. అయినా చివరి దాకా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల జాబితాను తేల్చేందుకు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఆయా ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పార్టీ అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో ఆశావహులు ఆసక్తి చూపుతూ తమ పేర్లను వారికి అందిస్తున్నారు.

మూడు జెడ్పీలు మహిళలకే
జిల్లాల పునర్విభజన కాకముందు ఉమ్మడి మెదక్‌ జిల్లాకు సంబంధించి జిల్లా పరిషత్‌ సంగారెడ్డి కేంద్రంలోనే ఉంది. జిల్లా పరిషత్‌ ప్రధాన కార్యాలయం కూడా సంగారెడ్డిలోనే ఉండడం గమనార్హం. పరిపాలనా సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతో ఉమ్మడి మెదక్‌లో సంగారెడ్డి, సిద్దిపేటలు కొత్తగా ఏర్పడ్డాయి. దీంతో ఈ జిల్లాల్లో పరిషత్‌లు కొత ్తగా ఆవిర్భవించనున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి మెదక్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌గా రాజమణి ఉన్నారు. సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా పరిషత్‌లు జనరల్‌ మహిళలకు కేటాయించారు.

మెదక్‌ జెడ్పీ పీఠం బీసీ మహిళ అధిష్టించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని మూడు జెడ్పీలు మహిళలకే రిజర్వు కావడంతో తమకు అవకాశాలు లేకపోవడంతో ఆ స్థానాల్లో తమ భార్యలు, ఇతర కుటుంబ సభ్యులను జెడ్పీ పీఠంపై కూర్చోబెట్టేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. తమ అభిప్రాయాలను ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో పంచుకుంటున్నారు. తమకు అవకాశమిస్తామని ముందుగా హామీ ఇస్తే జెడ్పీటీసీ అభ్యర్థులుగా పోటీ చేయిస్తామని వారు పేర్కొంటున్నారు.

ఆశావహులెందరో..
ఉమ్మడి జిల్లా నుంచి కొత్తగా ఏర్పడిన సంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవి జనరల్‌ మహిళకు కేటాయించడంతో ఆశావహులు టీఆర్‌ఎస్‌ నుంచి ఆ పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఉమ్మడి మెదక్‌ చైర్‌పర్సన్‌గా ఉన్న రాజమణి మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ పరిధిలోకి రావడంతో సంగారెడ్డి జెడ్పీ చైర్మన్‌గా కొత్తవారికి అవకాశం వస్తుందని ప్రచారం జరుగుతోంది. దీంతో సీఎం కేసీఆర్‌ ఎవరి పేరును ప్రకటిస్తారోనని టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రాదేశిక ఎన్నికలకు నేడో, రేపో నోటిఫికేషన్‌ వెలువడనున్న నేపథ్యంలో వచ్చే వారంలో నామినేషన్లు కూడా ప్రారంభం కానున్నాయి. దీంతో అభ్యర్థుల ఎంపిక కూడా నాలుగైదు రోజుల్లో ఖరారయ్యే అవకాశముందని పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి.

రిజర్వేషన్లు కలిసిరాకపోవడంతో..
సంగారెడ్డి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవి జనరల్‌ మహిళలకు కేటాయించారు. దీంతో కొంతమంది ఆశావహులకు తమ మండల జెడ్పీటీసీ అనుకూల కేటగిరీ రాకపోవడంతో పక్క మండలాల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకుగాను ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. దీనికి ఆయా మండలాల్లోని నాయకులు ఎంతమేరకు సహకరిస్తారనే విషయంలో లెక్కలు వేసుకుంటున్నారు. అధిష్టానం అధికారికంగా టికెట్‌ ఖరారు చేస్తే పార్టీ శ్రేణులు పనిచేయాల్సి వస్తుందని, టికెట్‌ తెచ్చుకోవడమే తరువాయి అని కొంతమంది ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీనికి రెండు, మూడు రోజుల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసే విధంగా ఆయా అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఎమ్మెల్యేలు సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఎంతమంది పోటీలో ఉన్నారనే విషయంలో ఆశావహుల నుంచి ముందుగా అభిప్రాయాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఒక్కో స్థానం నుంచి పదుల సంఖ్యలో ఆశావహులు తమ పేర్లను చెబుతున్నట్లు సమాచారం. దీంతో ఎవరి పేరును ఖరారు చేయాలనే విషయంలో ఎమ్మెల్యేలు సైతం ఆచితూచి అడుగేస్తున్నట్లు సమాచారం. ఎవరికి టికెట్‌ వచ్చినా అందరూ కలిసికట్టుగా పని చేయాలని, పార్టీ నిర్ణయమే శిరోధార్యంగా పనిచేయాల్సి ఉంటుందని శ్రేణులకు ఇప్పటి నుంచే దిశా నిర్దేశం చేస్తున్నారు. టికెట్‌ రాని పక్షంలో వారు నిరాశపడకుండా జాగ్రత్తగా వ్యవహరించడమే కాకుండా ఎవరికి టికెట్‌ ఇస్తున్నామనే విషయాన్ని కూడా గోప్యంగా ఉంచుతున్నారు. జెడ్పీ చైర్‌పర్సన్‌ ఎవరనేది గులాబీ బాస్‌ కేసీఆర్‌ నిర్ణయిస్తున్నందున అందరూ సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యేలు, ముఖ్యనేత లు ఆశావహులకు, పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా జిల్లాలో ప్రాదేశిక ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top