ఉద్యోగాల భర్తీలో విఫలం

TRS Failed In Tackling Unemployment Problem - Sakshi

 వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి

ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని సంతకాల సేకరణ

నల్లగొండ టూటౌన్‌ : తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన నిరుద్యోగ యువతను ప్రభుత్వం మోసం చేస్తుందని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ గురువారం నల్లగొండలో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన సంతకాల సేకరణలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

అసెంబ్లీ సాక్షిగా íసీఎం కేసీఆర్‌ లక్షా 6వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రకటించి నేటికీ 20వేలు కూడా భర్తీ చేయకపోవడం ప్రభుత్వం అసమర్థత  అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని, వాటిని ఎందుకు భర్తీ చేయలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇంటికో ఉద్యోగమని చెప్పి ఉద్యమ సమయంలో నిరుద్యోగులను వాడుకొని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు జారీ చేయకుండా మోసం చేసిందన్నారు.

లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ కోచింగ్‌ సెంటర్లకు లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం విడుదల చేసిన అతి కొద్ది ఉద్యోగాల నోటిఫికేషన్లు కూడా కోర్టులోనే నానుతున్నాయన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటికి యుద్ధప్రాతిపదికన నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

నిరుద్యోగులు, విద్యార్థులు సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పార్టీ తరుపున ఆందోళనలు తీవ్రతరం చేస్తామని అన్నారు.  పార్టీ జిల్లా అధ్యక్షుడు ఇంజం నర్సిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిందే నిధులు, నియామకాలు, నీళ్ల కోసమని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు.

కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు మేడిశెట్టి యాదయ్య, కోరె గోవర్ధన్, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎండీ ఫయాజ్, నాయకులు నరేష్‌గౌడ్, గాదరి రమేష్, మాచర్ల దశరథ, తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top